చంద్రబాబు సమర్పిస్తున్న ‘అప్పుచేసి పప్పుకూడు’

అప్పుడెప్పుడో అంటే దాదాపు 60 ఏళ్ళ క్రితం అప్పుచేసి పప్పుకూడు అనే సినిమా వచ్చింది. అందులో ఓ క్యారెక్టర్ దొరికిన ప్రతీ చోటా అప్పు చేసి డాబులు చేస్తుంటారు. చంద్రబాబునాయుడు వ్యవహారం కూడా అదే విధంగా కనిపిస్తోంది. నాలుగున్నరేళ్ళుగా దొరికిన ప్రతీ చోటా అప్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా రాజధాని భూములను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రూ 10 వేల కోట్లు అప్పులు తీసుకోమని సిఆర్డీఏకి ఆదేశాలిచ్చారు. రైతుల నుండి భూములను బలవంతంగా లాక్కునేటప్పుడేమో రాజధాని నిర్మాణానికి వ్యవసాయభూములిచ్చి రైతులు త్యాగాలు చేయాలంటూ ఊదరగొట్టారు. తీరా ఇపుడేమో తన అవసరాలకు రైతుల భూములను తాకట్టు పెడుతున్నారు. రాజధాని నిర్మాణం గురించి అడిగిన వారికి గ్రాఫిక్స్ లో సినిమా చూపిస్తున్నారు.

ఇంతకీ చంద్రబాబుకు రూ 10 వేల కోట్లు ఏమవసరం వచ్చింది ? ఏమొచ్చిందంటే అర్జంటుగా రైతు రుణమాఫీ చేయాలి. పోయిన ఎన్నికల్లో ఇఛ్చిన రైతు రుణమాఫీ హామీని చంద్రబాబు ఇంత వరకూ పూర్తిగా చేయలేదు. ఒకవైపు రుణమాఫీ చేసేసినట్లు చెబుతూనే మరోవైపు చివరి రెండు విడతల రుణమాఫీ చేయటానికి అప్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మరోవైపు పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీయే ఇంత వరకూ నెరవేర్చకుండా రేపటి ఎన్నికల్లో మళ్ళీ ఓట్లడిగితే రైతుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చంద్రబాబుకు సీన్ అర్ధమైపోయింది. అందుకనే అవకాశం ఉన్న చోటల్లా అప్పుకు ట్రై చేశారు.

కొత్త అప్పుకోసం తాకట్టు పెట్టటానికి ప్రభుత్వం దగ్గర బాండ్లు కానీ మరోటి కానీ ఉన్నట్లు లేదు. పైగా అప్పులు తెచ్చుకునే పరిమితిని చంద్రబాబు ఎప్పుడో దాటిపోయారు. అందుకనే ప్రభుత్వానికి ఏ ఆర్దిక సంస్ధ కూడా అప్పు ఇవ్వటం లేదు. అమ్మటానికి బహుశా బాండ్లు కూడా అయిపోయినట్లున్నాయి. అందుకనే రాజధాని భూములను తాకట్టు పెట్టాలని సిఆర్డీఏకి ఆదేశించారు. తెస్తున్న అప్పులు, తాకట్టు పెడుతున్న ఆస్తులను ఎవరు తీర్చాలి ? ఎవరు విడిపించాలి ? ఎవరంటే చంద్రబాబుకు అవన్నీ అవసరం లేదు. ఈరోజు అవసరం గడిస్తే చాలన్నట్లుగా ఉంది ఎకనామిక్స్ లో డాక్టరేట్ చేసిన చంద్రబాబు ఆలోచన.

అవకాశం దొరికిన ప్రతీచోటా తనకు ఇండస్ట్రీలో 40 ఇయర్స్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పుకునే చంద్రబాబు ఆచరణలో మాత్రం విరుద్ధంగా చేస్తున్నారు. నిజ్జంగా చెప్పాలంటే చంద్రబాబు ఆలోచనలన్నీ చాలా చవకబారుగా ఉంటున్నాయి. అందుకనే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తన అవసరాల కోసం చంద్రబాబు చేస్తున్న అప్పులను రాష్ట్రంలోని ప్రతీ ఒక్కళ్ళ తలపై సుమారు రూ 60 వేలకు బలవంతంగా రుద్దుతున్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే అప్పుచేసి పప్పుకూడు సినిమా కథ గుర్తుకురావటం లేదూ ?