ఓడిపోయినా పద్దతి మార్చుకోలేదు

మొన్నటి ఎన్నికల్లో జనాలు తెలుగుదేశంపార్టీకి గూబ గుయ్యిమనిపించినా చంద్రబాబునాయుడు కు బుద్ది వచ్చినట్లు లేదు. ఏదో ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదన్మాం చేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు అర్ధమైపోతోంది.  తాజాగా  తనకు ఉన్న భద్రత సరిపోదని చంద్రబాబునాయుడు హై కోర్టులో మరో పిటీషన్ వేయటమే అందుకు నిదర్శనం.

చంద్రబాబు భద్రత విషయం కొద్ది రోజులుగా వివాదాస్పదమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. తన భద్రతను కుదించారని చంద్రబాబు మొదట్లో చెప్పారు. జడ్ ప్లస్ భద్రతా క్యాటగిరిలో ఉన్న తనకు ప్రభుత్వం కావాలనే కుదించినట్లు కోర్టులో చంద్రబాబు కేసు వేశారు. అయితే విచారణ సమయంలో చంద్రబాబు పరువే పోయింది. చంద్రబాబుకు తాము భద్రత కుదించలేదని ప్రభుత్వం చెప్పింది.

జడ్ ప్లస్ భద్రతున్న చంద్రబాబుకు 58 మంది భద్రతా సిబ్బందిని కేటాయించుల్సుంటే తమ ప్రభుత్వం 74 మందిని కేటాయించినట్లు హోం శాఖ మంత్రి సుచరిత లెక్కలతో సహా వివరించారు. దాంతో ఏం చెప్పాలో అర్ధంకాని చంద్రబాబు మవునంగా ఉండిపోయారు. అయితే తాజాగా మరో పిటీషన్ వేశారు.

తనకు మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల నుండి ప్రాణహాని ఉందంటూ కొత్త నాటకాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రత సరిపోదంటూ అదనపు భద్రత కావాలంటూ పిటీషన్లో కోరారు. నిజానికి సిఎంగా ఉన్నపుడున్న భద్రత పదవి నుండి దిగిపోయిన తర్వాత ఉండదని చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా సరే కావాలనే ప్రభుత్వాన్ని గబ్బు పట్టించాలన్న ఉద్దేశ్యంతోనే కోర్టులో పిటీషన్ వేసినట్లు అర్ధమవుతోంది. మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.