ఈసిపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదా ?

చంద్రబాబునాయుడు వ్యవహారం విచిత్రంగా ఉంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కూడా ఇంత దిగజారిపోయి వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా రాష్ట్రంలోని ప్రధాన ఎన్నికల కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేది పై సీఈసీకి ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్ గా మారింది. తన సమీక్షలను అడ్డుకోవద్దని ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో చెప్పటం గమనార్హం.

తనను శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు చేయనీయకుండా ద్వివేది అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు మండిపోయారు.  పోలవరం, రాజధాని నిర్మాణంతో పాటు నీటి ఎద్దడి, ప్రకృతి వైపరీత్యాలపై తనను సమీక్షలు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈసి తన అధికార పరిధి దాటి మరీ తనను అడ్డుకున్నారంటూ చెప్పటమే విడ్డూరంగా ఉంది.

ఇక్కడ చంద్రబాబు గమనించాల్సిన విషయం ఏమిటంటే సమీక్షలు చేయకుండా చంద్రబాబును అడ్డుకోవటంలో ద్వివేది ఏమీ కొత్తగా నిబంధనలను పెట్టలేదు. ఎన్నికల కమీషన్ రూల్స్ బుక్ లో ఉన్న వాటినే ద్వివేది అమలు చేస్తున్నారు. కాకపోతే నిబంధనలను అమలు చేయటంలో స్ట్రిక్ట్ గా వ్యవహిరస్తుండటమే చంద్రబాబు అండ్ కో కి నచ్చినట్లు లేదు.  

పైగా ఈసిపై సీఈసీకి ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది ? సీఈసీ ఆదేశాలమేరకే కదా ఎన్నికల కమీషన్ నడుచుకునేది. సీఈసీ ఆదేశాలు లేకుండా ఈసి కొత్త నిబంధనలేమీ సృష్టించలేదు కదా ? అలాంటపుడు ఈసిపై సీఈసీకి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదన్న చిన్న విషయాన్ని కూడా చంద్రబాబు మరచిపోయారు. అసలు ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు కూడా ప్రభుత్వ వ్యవహారాల నుండి పార్టీ కార్యక్రమాలపై దృష్టిని పెట్టుంటే హుందాగా ఉండేది. అలాంటిది 14 ఏళ్ళు సిఎంగా పనిచేసిన చంద్రబాబు కూడా ఇంత దిగజారిపోయి ఎన్నికల కమీషన్ తో గొడవలు పెట్టుకోవటం ఏమీ బావోలేదు.