వచ్చే ఎన్నికలకు సంబంధించి సొంత జిల్లా నుండే చంద్రబాబునాయుడు టిక్కెట్ల ప్రకటనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలకు చంద్రబాబు అభ్యర్దులను ప్రకటించారు. నిజంగా సంప్రదాయానికి విరుద్ధంగా చంద్రబాబు టిక్కెట్లను ప్రకటించటంతో నేతలందరూ ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా అయితే నామినేషన్లకు చివరి రోజు ముందు కానీ చంద్రబాబు టిక్కెట్లను ప్రకటించరన్న విషయం అందరికీ తెలిసిందే.
సిట్టింగ్ ఎంఎల్ఏ అయినా, టిక్కెట్టు ఖాయంగా వస్తుందన్న విషయం అందరికీ తెలిసినా చంద్రబాబు మాత్రం తన పద్దతిని మార్చుకోరు. టిక్కెట్ల పంపిణీ సమయంలో చాలామంది నేతలకు బిపి, షుగర్ లెవల్స్ ఫుల్లుగా రైజింగ్ లో ఉంటుంది. అటువంటిది తన పద్దతికి విరుద్దంగా చిత్తూరు జిల్లాలో రెండు టిక్కెట్లు ప్రకటించటం విచిత్రంగా ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, పుంగనూరు నియోజకవర్గంలో కొత్త అభ్యర్ధి నూతనకాల్వ అనూషారెడ్డికి చంద్రబాబు టిక్కెట్లను ప్రకటించారు.
అమరావతిలో జరిగిన పై నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశంలో ఇద్దరికీ టిక్కెట్లను ప్రకటించారు. టిక్కెట్లు దక్కించుకున్న ఇద్దరిలో నాని చిత్తూరుకు చెందిన నేత. చిత్తూరు నేతకు చంద్రగిరిలో టిక్కెట్టు ఎందుకు ఇచ్చారో చంద్రబాబుకే తెలియాలి. బహుశా లోకేష్ కు సన్నిహితుడన్న ఏకైక కారణంతోనే నానికి టిక్కెట్టు దక్కిందని నేతలంటున్నారు. అలాగే, ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తే అయినా పోటీ చేసే అవకాశం దక్కించుకున్న అనూషారెడ్డి పలమనేరు ఫిరాయింపు ఎంఎల్ఏ, ఫిరాయింపు మంత్రి ఎన్. అమరనాధ్ రెడ్డికి స్వయానా మరదలు అవ్వటమే ఎకైక అర్హతగా భావిస్తున్నారు.
పై రెండు నియోజకవర్గాల్లోను వైసిపి ఎంఎల్ఏలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరు కూడా బలమైన ప్రత్యర్ధులే. మరి చిత్తూరు నేతకు చంద్రగిరి నియోజకవర్గంలో టిక్కెట్టిస్తే ఎంతమంది సహకరిస్తారో చూడాల్సిందే. అలాగే అనూషారెడ్డి కూడా పెద్దిరెడ్డిని ఏమాత్రం పోటీ ఇస్తారో చూడాలి.