ఇకనుండి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని నాగుబాబు డిసైడ్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు లో పోటీ చేసి అతికష్టం మీద మూడో స్ధానంతో సరిపెట్టుకున్నారు. అలాంటిది వచ్చే ఎన్నికల్లో కూడా నరసాపురం నుండే లోక్ సభకు పోటీ చేస్తానని తాజాగా ప్రకటించేశారు.
భీమవరం పర్యటనలో జనసైనికులతో కలిసిన నాగుబాబు మాట్లాడుతూ ఇకపై నెలలో వారం రోజుల పాటు నియోజకవర్గంలోనే పర్యటిస్తారట. మరి పర్యటించి ఏమి చేస్తారో మాత్రం చెప్పలేదు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెబుతున్న నాగుబాబుకు అంత తీరిక ఎక్కడుందో ?
రోజు టివి ప్రోగ్రాములతోనే సరిపోతున్న నాగుబాబుకు జనసేన నేతలతో కలవటమే కష్టంగా ఉంటోంది. అలాంటిది ఏకంగా జనాల్లోనే తిరుగుతానని, వాళ్ళ సమస్యలపై దృష్టి పెడతానని చెప్పటమంటే పెద్ద జోక్ గా ఉంది. మొన్నటి ఎన్నికల సమయంలోనే జనాలతో సరిగా మమేకం కాలేకపోయిన నాగుబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతుంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంది.
మొన్నటి ఎన్నికల్లో జనసేన 140 సీట్లలో పోటీ చేస్తే 100 సీట్లలో అసలు డిపాజిట్లే రాలేదు. పైగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్లా ఓడిపోయారు. దాంతో జనసేన భవిష్యత్ మీదే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు వచ్చే ఎన్నికల నాటికి జనసేన అస్తిత్వంపైనే అనుమానంగా ఉన్న సమయంలో నాగుబాబు ప్రకటన పెద్ద జోక్ గా తయారైంది.