చెల్లెలి తప్పుని క్షమించేసిన నాగబాబు.! వివాదం సద్దుమణిగినట్టేనా.?

ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద పోరాటం తర్వాత చేయొచ్చు.. ముందైతే, జనసేన పార్టీలోని అంతర్గత పోరాటాల మీద దృష్టిపెట్టుకోవాలి.! జనసేన పార్టీలో చిరంజీవి అభిమానులున్నారు.. పవన్ కళ్యాణ్ అభిమానులున్నారు.! రామ్ చరణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు.. ఇలా చెప్పుకుంటూ పోతే, ‘మెగా’ లిస్టు పెద్దదే.!

ఓ రాజకీయ పార్టీకి సినీ అభిమానులు కూడా బలం.! కానీ, ఆ అభిమానులతోనే ఏ రాజకీయ పార్టీ కూడా నడవదు. జనసైనికులంటే, పవన్ కళ్యాణ్ అభిమానులే.. అందునా, సినీ అభిమానులు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.. అని ఎంతలా పవన్ కళ్యాణ్ మొత్తుకుంటున్నా, ఆయన అభిమానులు మాత్రం మారడంలేదు.

జనసేన అధికార ప్రతినిథి రాయపాటి అరుణ, ‘ఫెయిల్యూర్ పాత్’ అంటూ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం పార్టీ’ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాత వీడియోనే అయినా, ఆ వీడియో కొత్తగా ట్రెండింగులోకి వచ్చింది. అంతే, జనసేన పార్టీలోని చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులకీ, పవన్ కళ్యాణ్ అభిమానులకీ మధ్యన పంచాయితీ షురూ అయ్యింది.

అదేంటీ, రాయపాటి అరుణ ఏదో అంటే.. అన్నదమ్ముల అభిమానుల మధ్య గొడవలేంటి.? అన్న ఇంగగితం ఆ అభిమానులకి వుండాలి కదా.? ప్చ్.. అదే వుంటే, అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఎందుకు అలా తయారవుతుంది.? ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి ఎందుకు ఇలా తయారవుతుంది.

జనసేన పార్టీకి అభిమానులే బలం. ఆ అభిమానులే బలహీనత కూడా. ఎన్నో విషయాల్లో పవన్ కళ్యాణ్‌ని వెనకేసుకొస్తూ, రాజకీయ ప్రత్యర్థుల్ని తనదైన స్టయిల్లో విమర్శించారు రాయపాటి అరుణ. ఆ స్థాయి పవన్ కళ్యాణ్ అభిమానులనండీ, చిరంజీవి అభిమానులనండీ.. ఎవరికైనా వుందా.?

నాగబాబు, రాయపాటి అరుణని ‘సోదరి’గా పేర్కొంటూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ, అభిమానులు అర్థం చేసుకోవద్దూ.?