ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా, ప్రజల్లో వీలైనంత ఎక్కువగా వుండేందుకు ప్రయత్నించాలి. లేదంటే, పార్టీకి చెందిన ముఖ్య నేతలు జనంలో వుండేలా చూడాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ ఆర్థిక అవసరాలు తీర్చేందుకోసం సినిమాలు చేయక తప్పదు. దాంతో, ఆయన అటు వైపు సినిమాలు చేస్తూ, ఇటు వైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా కొనసాగడమంటే అది అంత తేలికైన వ్యవహారం కాదు.
మెగా బ్రదర్ నాగబాబు, 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గానికి జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయాక, కొన్నాళ్ళు పార్టీకి దూరమయ్యారు. అదే జనసేన పార్టీని మరింత ఎక్కువగా దెబ్బ తీసింది. ఆ తర్వాత కూడా నాగబాబు పార్టీలో యాక్టివ్‌గా వుండి వుంటే, జనసేన ఈపాటికి ఇంకాస్త ఎక్కువ బలం పుంజుకుని వుండేదేమో.!
లేట్ అయితేనేం, లేటెస్ట్‌గా నాగబాబు జనంలోకి వెళ్ళడం ప్రారంభించారు.. పార్టీలో యాక్టివ్ అయ్యారు. మొన్నీమధ్యన జరిగిన పార్టీ 8వ ఆవిర్భావ సభ తర్వాతి నుంచే నాగబాబు, జనసేన శ్రేణులకు అందుబాటులోకి వచ్చినా, పార్టీ నేతల్ని సమన్వయం చేసుకోవడంలో మాత్రం చాలా చాలా వేగం చూపిస్తున్నారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో బిజీగా వున్న జనసేన నేత నాగబాబు, అటు అభిమానుల్ని, ఇటు పార్టీకి చెందిన ముఖ్య నేతల్నీ సమన్వయం చేస్తున్నారు. జనసైనికులకీ, సాధారణ ప్రజలకీ మధ్య మరింత మెరుగైన సంబంధాలు ఏర్పడేలా కార్యాచరణ రచిస్తున్నారు. జనసైనికులకు ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు.
‘జనసేన అంటే.. జనం కోసం పుట్టిన సేన’ అని జనానికి అర్థమయ్యేలా జనసైనికులతో చెప్పిస్తున్నారు నాగబాబు. అంతా బాగానే వుందిగానీ, వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా.? టీడీపీతో కలిసి వెళుతుందా.? బీజేపీతో టీడీపీతో కలిసి వెళుతుందా.? బీజేపీతో మాత్రమే కలిసి వుంటుందా.? అన్నదానిపై నాగబాబు స్పష్టత ఇవ్వడంలేదు.