పవన్ ని ప్రశ్నిస్తున్న ముస్లింలు!

సందర్భం వచ్చిన ప్రతీసారీ అవసరానికి తగ్గట్లు హామీలు, ఆ పూట గడిచిపోయేలా స్టేట్ మెంట్లు ఇవ్వడం.. అనంతరం సైలంట్ అయిపోయి కలుగులో దూరిపోవడం పవన్ కు ఆనవాయితీగా మారిపోయిందనే కామెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే అది ఈరోజేదో కొత్త ప్రారంభమైంది కాదు. 2014 ఎన్నికల ప్రచార సమయంలో… ప్రశ్నిస్తాను అని ప్రజలకు మాటిచ్చి, అనంతరం ప్రతిపక్షాలను ప్రశ్నించడం మొదలుపెట్టినప్పటినుంచి ఈ రాజకీయ అనారోగ్యం పవన్ కు ఉంది! అయితే తాజాగా ఇదే విషయాలపై పవన్ ను ప్రశ్నిస్తున్నారు ముస్లింలు!

బీజేపీ నుంచి ముస్లింల‌కు ఏదైనా ఇబ్బంది ఎదురైతే తాను అండ‌గా ఉంటాన‌ని గతంలో బలంగా చెప్పారు పవన్ కల్యాణ్. తానేదో బీజేపీతో అంటకాగుతున్నానని.. తన ముస్లిం కార్యకర్తలు, ముస్లిం అభిమానులు, ముస్లిం ప్రజానికం ఏమీ భయపడనవసరం లేదని.. వారికి ఏమైనా ఇబ్బంది వస్తే తాను అండగా ఉంటానని పవన్ బలంగా భరోసా ఇచ్చారు. అయితే… తెలంగాణ‌లో తాము అధికారంలోకి వ‌స్తే.. ముస్లింల నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్‌ ను ర‌ద్దు చేస్తామ‌ని అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై మాత్రం పవన్ ఇప్పటివరకూ స్పందించలేదు.

ఏపీలో టీడీపీకి ఏమి జరిగినా.. తెలంగాణలో బీఆరెస్స్ నేతలకు ఏ ఇబ్బంది వచ్చినా.. వెంటనే ఆన్ లైన్ వేదికగా ప్రకటన విడుదల చేసే పవన్ కల్యాణ్… తాను మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అగ్రనేత.. తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెబుతూ అంత పెద్ద స్టేట్ మెంట్ ఇస్తే… అదే రాష్ట్రంలో నివాసముంటున్న పవన్… కనీసం ట్విట్టర్ లో అయినా స్పందించలేదు. దీంతో… ముస్లిం సమాజం పవన్ పద్దతిపై విమర్శలు గుప్పిస్తుంది. తాను వంచించిన వారి లిస్ట్ లో తాజాగా తమను కూడా చేర్చేశారంటూ హర్ట్ అవుతుంది ముస్లిం సమాజం!

క‌ర్నాట‌క‌లో ముస్లింల రిజ‌ర్వేష‌న్‌ ను ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ర‌ద్దు చేసిన క్రమంలో… రేపు ఏపీలో బీజేపీ – టీడీపీ – జనసేనలు కలిసి అధికారంలోకి వస్తే… అక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్లు కచ్చితంగా తీసిపారేస్తుంది బీజేపీ! ఆ విషయంలో బీజేపీని ఆపే సత్తా అటు చంద్రబాబుకి గానీ, ఇటు పవన్ కి కానీ ఉండవు. గతంలోనూ లేవన్న విషయం 2014లోనే ఒకసారి తెలిసింది. మహా అయితే… ఒక ధర్నా.. రెండు స్టేట్ మెంట్లు వారిద్దరినుంచీ ఆశించొచ్చు!

ముస్లింల విషయంలో మోడీ సర్కార్ ఈ స్థాయిలో ప్రవర్తిస్తున్నా.. తెలంగాణలో రిజర్వేషన్స్ ఎత్తేస్తామన్నా… పవన్ స్పందించకపోవడంపై తెలంగాణలోని ముస్లిం సమాజం తీవ్ర నిరాసలో ఉంది. అమిత్ షా వ్యాఖ్యలపై కనీసం స్పందించకపోవడంతో… మౌనం అర్ధాంగీకారమని సరిపట్టుకోవాలా అంటూ పవన్ ను ప్రశ్నిస్తుంది. మరి ఇప్పటికైనా పవన్ ఈ విషయంపై స్పందిస్తారా? లేక… తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నచందంగానే వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాలి!