ఆ విషయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’లో చూపింది తప్పు : మురళీ మోహన్

తెలుగు రాజకీయాల్లో సంచలన అధ్యాయమైన వైశ్రాయ్ ఘటన ని చరిత్ర ఓ పట్టాన మర్చిపోదు. అవకాశమున్నప్పుడల్లా మీడియా సాయంతో గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. రీసెంట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఆ టాపిక్ మరోసారి వచ్చి డిస్కషన్ కు దారి తీసింది. ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా పదవి నుంచి దించి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నారంటూ అదంరూ ఈ సంఘటనపై చర్చించుకున్నారు. ఈ ఘటనపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు సన్నిహితుడు, ప్రముఖ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్ స్పందించారు.

మురళి మోహన్ మాట్లాడుతూ…వైశ్రాయ్ ఘటన జరుగబోయే ముందు రోజు రాత్రి అక్కడ చంద్రబాబుతో ఎమ్మెల్యేలంతా క్యాంపు పెట్టారు. జయప్రకాష్ నారాయణగారు ఆ సమయంలో ఎన్టీ రామారావు వద్ద పీఎస్‌గా ఉండేవారు. ఆయనకు కూడా ఇది నచ్చలేదు. వెంటనే నాకు ఫోన్ చేసి…. మురళీ మోహన్ గారు ఎన్టీరామారావుగారు ప్రెస్ వీరిని పిలిచారు. ఏదో చెబుతానంటున్నాడు. నేను ఆయన్ను ఆపుతాను. మీరు వాళ్లతో మాట్లాడి ఈ విభజన జరుగకుండా చూడండి అన్నారు. నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వైశ్రాయ్ హోటల్ వద్దకు వెళ్లాను. కానీ అప్పటికే చాలా లేటయింది, నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకోవడం జరిగిందని…. మురళీ మోహన్ చెప్పారు.

అలాగే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో వైస్రాయ్ హోటల్‌లో ఉన్నది కార్యకర్తలు అని చూపించి ఉండొచ్చు కానీ… హోటల్‌లో ఉన్నది ఎమ్మెల్యేలే. నేను స్వయంగా హోటల్ లోకి వెళ్లి చూశాను కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రచారం విభాగం బాధ్యతలు చూశాను, అన్ని ప్రాంతాలు తిరిగాను కాబట్టి ఎవరు ఎమ్మెల్యేలనే విషయం బాగా తెలుసు. వందమందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆసమయంలో జరిగిన గొడవలో ఎవరో ఆకతాయి చెప్పు విసిరారు. అది పెద్దాయనకు తగల్లేదు కానీ అక్కడి వరకు వచ్చి పడిందని… మురళీ మోహన్ అన్నారు.

లక్ష్మీ పార్వతి గురించి చెప్తూ….ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన భార్య చనిపోయారు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన్ను దగ్గరుండి చూసుకునే మనిషి లేకుండా పోయారు. పిల్లలంతా అప్పుడప్పుడు వచ్చి కలిసేవారు. ఆ సమయంలోనే లక్ష్మిపార్వతి ఆయనకు దగ్గరైంది. పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత అసలు కథ మొదలైందని మురళీ మోహన్ తెలిపారు.