నోరే కదా అని జారిపోతే, మాటే కదా అని ఇచ్చేస్తే.. ఆ తర్వాత ఆ మాటను నిలబెట్టుకోకపోతే ఎదురయ్యే సమస్యలు ఏస్థాయిలో ఉంటాయనే విషయం పవన్ కల్యాణ్ కు ఇప్పటికే తెలిసి ఉండాలి. తెలియని పక్షంలో 2024 ఎన్నికల ఫలితాల అనంతరం కచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. అందుకు కారణం… సినిమా స్టైల్లో డైలాగులు వేస్తూ, అభ్యర్థులకు టిక్కెట్లపై బహిరంగంగా వేల ప్రజల ముందు హామీలు ఇచ్చేసి, తర్వాత సైలంట్ అయిపోవడమే!
అవును… ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమికి సరికొత్త తలనొప్పులు తెరపైకి వస్తున్నాయి. ఒకపక్క చంద్రబాబు చేసిన తప్పుల ప్రభావం ఇప్పటికే కూటమికి అతిపెద్ద సమస్య అని అంటుండగా.. మరోపక్క చిలకలూరిపేట సభలో మోడీ చేసిన ప్రసంగం మరో సమస్య అని అంటుండగా.. జనసేన అసంతృప్తులు కూడా అందుకు ఏమాత్రం తగ్గని సమస్యే అని అంటున్నారు. ఈ క్రమంలో ఒకరితర్వాత ఒకరు తెరపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముమ్మిడివరం జనసేన నేత తెరపైకి వచ్చారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం జనసేన ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ తాజాగా మైకులముందుకు వచ్చారు. తనకు టిక్కెట్ దక్కకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా… గతంలో తనకు పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని గుర్తుచేసి మరింత ఆవేదన చెందుతున్నారు. ఏకంగా తనను మంత్రిని చేస్తానని పవన్ చెప్పారని.. ఆ సంగతి దేవుడెరుగు కనీసం ఎమ్మెల్యే టిక్కెట్ కూడా ఇవ్వలేదని ఆయన వాపోతున్నారు. పవన్ చెప్పే మాటలకూ చేసే పనులకూ పొంతన ఉండదనే విమర్శలకు ఇది తాజా బలం!
ఈ పరిస్థితుల్లో తనకు టిక్కెట్ ఎందుకు రాలేదు.. అసలు వచ్చే అవకాశం ఉందా లేదా.. తన దారి తనను చూసుకోమంటారా.. విషయం ఏదైనా కూడా ఒక్కసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడే అవకాశం పవన్ కల్యాణ్ కల్పించడం లేదని అంటున్నారు. పైగా శెట్టిబలిజలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదో పవన్ చెప్పాలని నిలదీస్తున్నారు. అయితే… ఇప్పటికే తనకు సరైన హామీ ఇవ్వాలని బాలకృష్ణ కోరుతుండటం గమనార్హం.
ఇదే సమయంలో తనకు వైసీపీ సహా అన్ని పార్టీల నుంచీ ఆహ్వానాలు అందుతున్నాయని చెబుతున్న పితాని బాలకృష్ణ… ఒక్కసారి పవన్ కల్యాణ్ తో మాట్లాడి, భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని చెబుతున్నారు. దీంతో… తణుకులో విడివాడ రామచంద్రరావు, విజయవాడలో పోతిన మహేష్ మొదలైన నేతల జాబితాలో తాజాగా పితాని బాలకృష్ణకూడా వచ్చి చేరినట్లయ్యిందని.. వీరితో మాట్లాడి పవన్ బుజ్జగించని పక్షంలో పెద్ద ప్రమాదం తప్పకపోవచ్చని అంటున్నారు.