(పికె)
తాను ఏ పని చేసినా అది చారిత్రకమని చెప్పుకునే చంద్రబాబు తాజాగా మరో చరిత్రాత్మక కార్యక్రమానికి తెరదీస్తున్నారు. అది రాజధానిలో శాశ్వత సచివాలయం, కార్యదర్శుల కార్యాలయ భవనాలకు ఫౌండేషన్ వేయడమే. ఇప్పటికి రాజధానిలో బోలెడు సార్లు ఫౌండేషన్లు వేశారు. అవన్నీ మామూలువి కావని, అసాధారణమయిన ఫీట్స్ అని ప్రచారం చేస్తున్నారు.
నిన్నగాక మొన్న పోలవరం ప్రాజెక్టులో ఒక గేటును ఏర్పాటు చేయడాన్ని ఒక చారిత్రక కార్యక్రమం అంటూ హంగామా చేశారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే శంకుస్థాపన ఆ తర్వాత గృహప్రవేశం చేయడం సర్వసాధారణం. కానీ చంద్రబాబు తన హాయాంలో భూమిపూజ, శంకుస్థాపన, ఫౌండేషన్, ద్వారాలు పెట్టడం, గోడలు కట్టడం, ప్లాస్టింగ్ చేయడం, స్లాబు వేయడం, రంగుల వేయడం వంటి పనులన్నింటినీ తానే ప్రారంభించి అవే గొప్ప ప్రచారం చేస్తున్నారు.
ఇప్పుడు రాజధానిలో సచివాలయం టవర్లకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేయడాన్ని గొప్పగా చిత్రీకరిస్తున్నారు. దేశంలో ఇంతవరకూ ఈ స్థాయి ఫౌండేషన్ ఎవరూ వేయలేదట. అసలు ర్యాఫ్ట్ ఫౌండేషన్ అనేది ఒక బలహీనతని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. భూమి బలహీనంగా ఉన్న చోట నిర్మించే భవనాల కోసం ఈ తరహా ఫౌండేషన్ వేస్తారు. అమరావతిలో లూజ్ సాయిల్ వల్ల భారీ కట్టడాలు నిర్మిస్తే ఇబ్బంది ఉంటుందని మొదటి నుంచి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం అమరావతిలో నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలకు సైతం భారీ ఫౌండేషన్లు వేయాల్సివచ్చింది.
బలహీనంగా ఉన్న నేలపై ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేయాలని నిర్ణయించారు. దీన్ని కూడా గొప్పగా చిత్రీకరించుకోవడం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని పరిపాలన నగరంలో సచివాయాన్ని ఐదు టవర్లుగా నిర్మించేందుకు డిజైన్లు రూపొందించారు.
అందులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే జీఏడీ టవర్‌ను 50 అంతస్తులు, మిగిలిన టవర్లను 40 అంతస్తుల వరకూ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఐదు టవర్ల కోసం ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేయనున్నారు. 12 వేల క్యూబిక్ మీటర్ల మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నామని, దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదేనని సీఆర్డీఏ చెబుతోంది. ఈ ఐదు టవర్లను ఒకే రాఫ్ట్ ఫౌండేషన్‌పై నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం వేల మంది కార్మికులు, వందల సంఖ్యలో యంత్రాలు, టన్నుల కొద్ది నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ చెబుతున్నారు.
పునాది వేయడాన్నే ఇంత గొప్పగా చూపడం, ఆ పనుల్ని ముఖ్యమంత్రి ప్రారంభించడానికి సిద్ధం కావడం ఏమిటని పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. దీన్ని ఒక భారీ కార్యక్రమంగా నిర్వహించేందుకు సీఆర్‌డీఏ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఇదే అతిపెద్ద ర్యాఫ్ట్ ఫౌండేషన్ అని, ప్రపంచ స్థాయి నిర్మాణాల్లో భాగంగా ఈ ఫౌండేషన్ వేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు.
నాలుగున్నరేళ్లపాటు రాజధానిలో శాశ్వత నిర్మాణాల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆ పనులు మొదలు పెట్టి వాటినే గొప్పగా ప్రచారం చేస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సచివాలయాన్ని ఐదు టవర్లుగా నిర్మించాలని నిర్ణయించి అందుకోసం వేస్తున్న పునాదిని రికార్డుగా ప్రచారం చేస్తూ స్వయంగా గురువారం ఉదయం 8.50 గంటలకు ముఖ్యమంత్రి దాన్ని ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లూ తాత్కాలిక నిర్మాణాలు, శంకుస్థాపనలతో కాలక్షేపం చేసి ఇప్పుడు పునాది వేయడాన్నే గొప్పగా చిత్రీకరించుకోవడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.