ముద్రగడా జీ లైట్… జనసేన కాపుల కోసం కాదు జోగయ్యా!

టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు. ఈ సమయంలో 118 సీట్లకు ప్రకటించిన చంద్రబాబు… అందులో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మిగిలిన 24 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఈ సమయంలో 94 నియోజకవర్గాలు, అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. జనసేన అధినేత మాత్రం ఐదు నియోజకవర్గాల పేర్లు, అభ్యర్థులను ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గంలో లుకలుకలు మొదలైపోయాయని అంటున్నారు. ఇప్పటికే జనసేనకు 24 సీట్లే ఇచ్చారని ఆవేదన చెందుతున్న జనసేన మద్దతు దారులు, జనసైనికుల బాదను రెట్టింపు చేస్తున్నట్లుగా పవన్ ఒక వ్యాఖ్య చేశారు. ఇందులో భాగంగా.. చాలా మంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని చెప్పారు కానీ గతంలో 10 సీట్లు గెలిచి ఉండుంటే అడగటానికి ఉండేది అని అన్నారు!!

వాస్తవానికి పొత్తులో భాగంగా జనసేనకు కనీసం 60 స్థానాలు కేటాయించకపోతే కాపుల ఓట్లు గంపగుత్తగా టీడీపీకి ట్రాన్స్ ఫర్ కావని జోగయ్య గతంలో పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ముద్రగడ కూడా తనను కలిసి జనసేన కాపు నేతలతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అంటున్నారు. ఇక ఈ విషయంపై జోగయ్య రాసిన లేఖలు అన్నీ ఇన్నీ కాదు! మరి ఆ లేఖలు పవన్ చదివారా.. లేక, చదివినా ఇలా లైట్ తీసుకున్నారా??

దీంతో… జోగయ్యే కానీ, కాపుల కోసం పోరాడిన ముద్రగడ వంటి నేతలే కానీ… ఇకపై “సీట్ల విషయంలోనే కానీ, జనసేన పార్టీ అంతర్గత విషయాల్లో కానీ, టీడీపీతో పొత్తు విషయాలపై కానీ, తాను తీసుకోవాల్సిన నిర్ణయాలపై కానీ, పలు నియోజకవర్గాల్లో కాపుల బలంపై కానీ, కాపుల ఆత్మాభిమానం టాపిక్ పై కానీ, రాజ్యాధికారంలో వాటా వంటి పెద్ద పెద్ద విషయాలపై కానీ నోరెత్తకుండా” పవన్ క్లారిటీ ఇచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో… కాపులు జనసేనను ఓన్ చేసుకున్నారు కానీ… ఆ పార్టీ అధినేత మాత్రం కాపుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదనే చర్చ మాత్రం తెరపైకి వచ్చింది. దీంతో… జనసేన అంటే టీడీపీ బీ టీం అనే కామెంట్లు కాపు సామాజికవర్గ ప్రజానికం నుంచి వినిపిస్తుండటం గమనార్హం. మరి ఉన్న 24 స్థానాల్లోనూ రిజర్వుడు స్థానాలు తీసేయగా… కాపులకు పవన్ ఎన్ని సీట్లిస్తారో వేచి చూడాలి.