లోకేష్ గెలుపుపై చంద్రబాబులో టెన్షన్  

రాబోయే ఎన్నికల్లో లోకేష్  పోటీ చేసే విషయంలో చంద్రబాబునాయుడు లీకుల మీద లీకులిచ్చేస్తున్నారు. అసలెందుకు ఇన్ని లీకులు ఇస్తున్నారో టిడిపి నేతలకే అర్ధం కావటం లేదు. చంద్రబాబు చేస్తున్న ఈ లీకులతో లోకేష్ సామర్ధ్యంపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయ్. ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ కు పోటీ చేయటానికి ఒక్క సేఫ్ నియోజకవర్గం కూడా కనబడటం లేదంటే పార్టీ పరిస్ధితి ఎలాగుందో అర్ధమైపోతోంది.

ముందు హిందుపురం అన్నారు. తర్వాత కుప్పం పేరు తెరపైకొచ్చింది. తర్వాత చాలా పేర్లే వినబడినా చివరకు విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గమే ఖాయమన్నారు. చివరకు అదికూడా పోయి తాజాగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గమంటున్నారు. మరి ఇది కూడా ఎన్నిరోజులు నిలుస్తుందో అనుమానమే.

అసలు లోకేష్ పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు ఎందుకింత గోప్యత పాటిస్తున్నారో అర్ధం కావటం లేదు. కుప్పం నియోజకవర్గం కాకుండా మరెక్కడ పోటీ చేసినా లోకేష్ గెలుపు అంత ఈజీకాదన్న విషయం వాస్తవం. ఎందుకంటే, లోకేష్ సామర్ధ్యం ప్రపంచానికంతా తెలుసు కాబట్టి. తానెక్కడ పోటీ చేసినా పార్టీకి ఊపు తేవాల్సిన లోకేష్ చివరకు ఆ పార్టీకే గుదిబండలాగ తయారైనట్లున్నారు. అందుకే చంద్రబాబుకు ఒక్క సేఫ్ నియోజకవర్గం కూడా కనబడలేదు.

నిజంగా తన పుత్రరత్నం గెలవాలని చంద్రబాబుకుంటే కుప్పం నియోజకవర్గాన్ని లోకేష్ కు అప్పగించటం ఒకటే మార్గం. చంద్రబాబు ఎక్కడనుండి పోటీ చేసినా గెలుపు ఈజీనే. మరి ఇంత చిన్న విషయానికి చంద్రబాబు ఎందుకంతగా ఆలోచిస్తున్నారో అర్ధం కావటం లేదు. లోకేష్ కుప్పంలో పోటీ చేస్తేనే నేతలకు కూడా సుఖం. లేకపోతే చినబాబును గెలిపించేందుకు నేతలు నానా అవస్తలు పడాల్సిందే. తన గెలుపుకన్నా పుత్రరత్నం గెలుపే చంద్రబాబుకు ముఖ్యమిప్పుడు.