గ్రౌండ్‌ ఫ్లోర్‌ బలిసిందా డాడీ… నందమూరి మోక్షజ్ఞ పద్ధతి.?

సాధారణంగా కుమారుడికి తండ్రి అంటే భయం, గౌరవం, భక్తి, ప్రేమ ఉంటాయి! నందమూరి బాలకృష్ణను చూసినప్పుడు చాలామందికి అదే భావన కలుగుతుంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రస్థావన వస్తే ఆయనలో కనిపించే ఆరాధనా భావం, తండ్రి అనే గౌరవం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుందని చాలా మంది చెబుతుంటారు. నిత్యం “మా నాన్న గారూ…” అంటూ రకరకాల విషయాలు పంచుకుంటారని అంటుంటారు. అయితే బాలయ్యకు మాత్రం తండ్రిగా ఆ ఛాన్స్ లేదని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే… సినిమాల్లో మాస్‌ డైలాగులతో మెప్పించడంలో బాలయ్య రూటే సెపరేటు అనడంలో ఎవరికీ అతిశయోక్తి ఉండదు! విలన్లకు ఆయన ఇచ్చే వార్నింగులు ఓ రేంజ్‌ లో ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ నటించిన చిత్రం “భగవంత్‌ కేసరి”లోనూ ఓ మాస్‌ డైలాగ్‌ ఇటీవల చిత్ర బృందం గ్లింప్స్‌ ద్వారా వెల్లడించింది. “గ్రౌండ్‌ ఫ్లోర్‌ బలిసిందా బే”.. అంటూ సినిమాలో విలన్‌ కు బాలయ్య వార్నింగ్‌ ఇచ్చే డైలాగ్ అది!

కట్ చేస్తే… ఆ డైలాగ్ బాలయ్యకు నిజజీవితంలోనే ఎదురైందంట. అలా అని బయట వ్యక్తులో అన్నారనుకుంటే పొరపాటే సుమా.. స్వయంగా ఆయన పుత్రరత్నం నందమూరి మోక్షజ్ఞ… బాలయ్యను ఉద్దేశించి ఈ మాట అన్నారంట. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ.. వేదికగపై మైకులో చెప్పారు. దీంతో సభాస్థలి అంతా నవ్వులు పూయగా… పలువురు మాత్రం “పెంపకం…” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

“భగవంత్‌ కేసరి” సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌ ను ఆదివారం సాయంత్రం వరంగల్‌ లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన బాలకృష్ణ వేదికపై మాట్లాడుతూ.. “ఈరోజు పొద్దున్నే శ్రీలీలతో ఓ మాట అన్నాను. ఇద్దరం కలిసి నటించాం సరే. నువ్వు చిచ్చా.. చిచ్చా అని నన్ను టార్చర్‌ పెట్టావ్‌. నెక్స్ట్‌ సినిమాలో మనం హీరో హీరోయిన్లుగా నటిద్దామని చెప్పాను. ఇదే మాట ఇంటికెళ్లి మా కుటుంబ సభ్యులతో చెప్పాను” అని చెప్పుకొచ్చారు బాలయ్య!

అనంతరం… “దీంతో… నా కొడుకు మోక్షజ్ఞకు కోపమొచ్చింది. ఏం డాడీ, నేను హీరోగా రాబోతున్నాను, నువ్వు ఆవిడకు ఆఫర్‌ ఇస్తానంటావేంటి..? నీకు గ్రౌండ్‌ ఫ్లోర్‌ బలిసిందా డాడీ అన్నాడు. నాకు కాసేపు అర్థంకాలేదు. నన్ను అంత మాట అన్నాడేంటని అర్థం కాలేదు..” అంటూ తన కొడుకు తనకు వార్నింగ్‌ ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు బాలయ్య.

అయితే… తన తాజా చిత్రంలోని మాస్‌ డైలాగ్‌ ఎంతో ఫేమస్ అయ్యిందని, ఆ డైలాగ్ తోనే మోక్షజ్ఞ తనను ఫన్‌ చేసే ప్రయత్నం చేశాడని చెప్పాలనుకోవడం బాలయ్య ఉద్దేశ్యం అవ్వొచ్చు. అయితే.. ఎంతోమంది వీక్షించే వేదికపైనే ఆయన ఈ విషయం చెప్పేయడం ద్వారా ఫన్‌ కంటే.. నవ్వులపాలైన తీరే ఎక్కువగా కనిపించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ట్రోల్స్ సంగతి వేచి చూడాలి!!