ప్రజా ప్రతినిథుల రాజీనామాలు.! వైసీపీలో అసలేం జరుగుతోంది.?

ఎన్నికల ముందర రాజకీయ నాయకులు జంపింగ్ జపాంగులవడం మామూలే.! కానీ, అధికార వైసీపీ నుంచి, ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అంటే, వైసీపీ చెబుతున్న వైనాట్ 175 జమానాలో ఎందుకు ప్రజా ప్రతినిథులు పెద్ద సంఖ్యలో వైసీపీని వీడుతున్నట్టు.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చాలాకాలంగా వైసీపీకి దూరంగా వుంటున్నారు. కానీ, ఇటీవలే ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడారు. మొన్నీమధ్యనే వైసీపీకి రాజీనామా చేశారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. తాజాగా ఇంకో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

నలుగురు ఎంపీలు వైసీపీకి రాజీనామా చేయడమంటే చిన్న విషయం కాదు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలుగా గెలిచిన సంగతి తెలిసిందే. మిగిలిన పద్ధెనిమిదిమందిలో కొందరు ఈసారి పార్లమెంటుకి కాకుండా, అసెంబ్లీకి పరిమితమవుతున్నారు. కొందరు, అధినాయకత్వంపై అలకతో వున్నారు.

ఓ అరడజను మంది ఎంపీలు వైసీపీ నుంచి ముందు ముందు వేరే పార్టీల్లోకి జంప్ చేయనున్నారన్నది తాజా ఖబర్. ఈ ప్రచారంలో నిజమెంత.? అన్నది తేలాల్సి వుంది. ఇక, ఎమ్మెల్యేల విషయానికొస్తే.. ఈ లెక్క కూడా గట్టిగానే కనిపిస్తోంది.

ఎవర్నీ బుజ్జగించడంలేదా వైసీపీ అధినాయకత్వం.. అంటే, బుజ్జగిస్తోందిగానీ.. పని జరగడంలేదంతే.! ‘స్క్రాప్ అంతా పోతోంది..’ అని వైసీపీ నేతలు సహజంగానే లైట్ తీసుకుంటున్నారు. కానీ, అలా స్క్రాప్ అనుకున్న నేతలు, వైసీపీకి చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు.