ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ మాట వినడంలేదా.?

పదే పదే అదే హెచ్చరిక.! కానీ, ఎమ్మెల్యేలలో మార్పు రావడంలేదు. మంత్రుల పరిస్థితి కూడా అదే.! అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది.? అస్సలేమాత్రం మొహమాటం లేకుండా వ్యవహరిస్తారు వైఎస్ జగన్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. పరిస్థితులు మారాయి.

గతంలో అయితే, మాట వినని నేతలపై మొహమాటపడకుండా రాజకీయంగా వేటు వేసేసేవారు వైఎస్ జగన్. కానీ, ఇప్పుడు పరిస్థితి అది కాదు. పదే పదే హెచ్చరికలు.. కాసిన్ని బుజ్జగింపులు.. వెరసి, వైఎస్ జగన్ కొత్త పోకడలకు పోతున్నారు.

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల వద్దకు వెళ్ళాలని ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం చాన్నాళ్ళుగా జరుగుతోంది. ఎమ్మెల్యేలు జనం వద్దకు వెళుతున్నారు.. అదీ మొహమాటంగా.. ఒకింత భయంతో.

జనం వద్దకు వెళ్ళినప్పుడు, ఆ జనం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత తేలిక కాదు ప్రజా ప్రతినిథులకి. అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు కావడంతో, సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత వారి మీదనే వుంటుంది. ఆ సమస్యలకు పరిష్కారం ఎటూ దొరకదు. దాంతో, సమాధానం చెప్పలేక నానా తంటాలూ పడుతున్నారు. దాంతో, కొందరు వెళ్ళడానికీ ఇష్టపడటంలేదు.

‘వెళ్ళకపోతే ఎలా.?’ అంటూ ముఖ్యమంత్రి ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా 32 మంది ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. మరి, ఆ ఎమ్మెల్యేలు ఏమన్నారట.? అదైతే సస్పెన్సే. ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా ఎమ్మెల్యేలు మాట వినడంలేదంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.