కోమటి రెడ్డి సోదరులకు ఒక ఎమ్మెల్యే లీగల్ నోటీసులు పంపించారు. అంతే కాకుండా వారు అనుచిత వ్యాఖ్యలు చేశారని దానిని ప్రసారం చేసిన రెండు టివి ఛానళ్లు, దినపత్రిక యాజమాన్యాలకు కూడా నోటీసులు ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి కూడా ఆ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
నకిరేకల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటిసులు పంపించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన పరువును తీస్తున్నారనే ఆరోపణలతో ఎమ్మెల్యే వీరేశం నోటిసులు పంపించారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి, వి.హనుమంతరావు లతో పాటు మరో రెండు న్యూస్ ఛానళ్లు, ఓ దిన పత్రికకు ఆయన నోటిసులు పంపించారు.
నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ హత్యకేసుతో తనకు, మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధం ఉన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఆరోపించారని, వారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని లేకపోతే చట్టం ప్రకారం సివిల్, క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందని వీరేశం తన లాయర్ ద్వారా వారికి నోటీసులు పంపించారు. వారితో పాటు వారి వ్యాఖ్యలను ప్రసారం చేసిన రాజ్ న్యూస్, సాక్షి ఛానళ్లకు, సాక్షి దినపత్రిక యాజమాన్యానికి కూడా లీగల్ నోటిసులు పంపించారు. అంతే కాకుండా కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని నల్గొండ ఎస్పీకి వీరేశం రాత పూర్వక ఫిర్యాదు చేశారు.
కోమటి రెడ్డి బ్రదర్స్ కి , నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు ఉన్నాయని నేతలంటున్నారు. ఆది నుంచి కూడా నల్లగొండలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఎలాగైనా టిఆర్ ఎస్ బలమైన పార్టీగా మారాలని నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 24 జనవరి 2018 న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు, నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యను టిఆర్ ఎస్ నేతలే చేయించారని కాంగ్రెస్ నేతలు బలంగా ఆరోపించారు.
బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నల్గొండలో జరిగింది. ఈ సంతాప సభకు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశమే శ్రీనివాస్ హత్యకు సూత్రధారులని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, వి.హనుమంత్ రావు, రాజగోపాల్ రెడ్డిలు కూడా పరుష పదజాలంతో దూషించారని ఎమ్మెల్యే తన నోటిసుల్లో పేర్కొన్నారు. ఈ అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేసిన రాజ్ న్యూస్ , సాక్షి ఎండీ లపై కూడా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే లీగల్ నోటిసులో పేర్కొన్నారు. వారి వ్యాఖ్యల పట్ల తన గౌరవానికి భంగం కలుగుతుందని, తక్కువ సమయంలో ఉన్నత స్థానానికి ఎదిగాననే కక్ష్యతోనే వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తనకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే వీరేశం డిమాండ్ చేశారు. వీరేశం నోటిసుల వ్యవహారం నల్లగొండ జిల్లాలో చర్చనీయాంశమయింది.