జైల్లో రంభ, ఊర్వశి, మేనక కన్ను కొడతారా… కొడాలి సెటైర్స్ పీక్స్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాబు అరెస్ట్ పై భువనేశ్వరి, లోకేష్ లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో బాబుకు జైల్లో సౌకర్యాలు సరిగా లేవని భువనేశ్వరి చెబుతుంటే… జగన్ కు వడ్డీతో సహా రిటన్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని చినబాబు చెబుతున్నారు.

ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలపై కొడాలి నాని స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరీలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా… చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడంటూ నాని విమర్శించారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని నాని సెటైర్స్ వేశాడు.

ఇదే సమయంలో లోకేష్‌ మా పేర్లు రెడ్‌ బుక్‌ లో రాస్తున్నాడని.. మేము లోకేష్‌ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని సెటైర్లు వేసిన కొడాలి నాని… ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని చెప్పిన లోకేష్‌.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా అంటూ చురకలంటించారు. ఈ సందర్భంగా.. తన యువగళం పాదయాత్రలో భాగంగా “ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత పెద్ద నామినేటెడ్ పదవి” అని కార్యకర్తలను రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా… ఓ పక్కన “అన్నయ్య”ను, మరో పక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నాడని చెప్పిన కొడాలి నాని… 2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరీ అంటున్నారని, హెరిటేజ్ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత కాలం మాకు తిరుగులేదు అని కొడాలి నాని అన్నారు.

తన భర్తకు వసతుల్లేవు.. వేడి నీళ్లు లేవని భువనేశ్వరి అంటున్నారు.. ఏసీలు, ఫ్రిజ్‌ లు, కూలర్లు ఉండటానికి అదేం ఇల్లు కాదు.. జైలు! జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలి అంటూ కొడాలి ఫైరయ్యారు.

ఇదే సమయంలో “బాబుతో నేను” అంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు.. బాబుతో పాటు జైలుకెళ్తారా..? చంద్రబాబు కోసం ఎవ్వరూ పాదయాత్రలు చేయరు.. కార్ల యాత్రలు మాత్రమే చేస్తారు, చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మొళ్లు మాత్రమే. పొరుగు దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఎస్సీలు, బీసీలు ఏమైనా బాబుకోసం నిరసనలు చేస్తున్నారా? అని కొడాలి సూటిగా ప్రశ్నించారు.