తలనొప్పిగా మారిన చింతమనేని

ఆయనో బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎంఎల్ఏ. పైగా రెండుసార్లు గెలిచి మూడోసారి పోటీకి రెడీ అవుతున్నారు. పార్టీలో బాగా సీనియర్. అయినా ఆయన వైఖరి మాత్రం ఫక్తు వీధిరౌడీనే. ఆయనే చింతమనేని ప్రభాకర్. చింతమనేని గురించి ఇంతకన్నా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తెలుగుదేశంపార్టీ మొత్తం మీద ప్రతీరోజు వార్తల్లోను అంతకన్నా వివాదాల్లోను ఉండే ప్రజాప్రతినిధి ఎవరంటే చింతమనేనే ముందుంటారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, తాజాగా చింతమనేని టిడిపి నేతపైనే దౌర్జన్యం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం ఎంఎల్ఏ చింతమనేనిది మొదటి నుండి కూడా బాగా దూకుడు మనస్తత్వం. ఎవరి మీద పడితే వారిమీదకు వెళిపోతుంటారు కొట్టడానికి. విచిత్రమేమిటంటే చింతమనేనిపై  వేర్వేరు పోలీసు స్టేషన్లలో సుమారు 30 కేసులున్నాయి. పైగా ఎంఎల్ఏపై పోలీసులు రౌడీషీటర్ కూడా ఓపెన్ చేశారు. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పై గతంలో దౌర్జన్యం చేసిన ఘటనలో చింతమనేనికి దెందులూరు కోర్టు రెండేళ్ళు జైలుశిక్ష కూడా విధించింది. అయిన ఆయనలో మార్పు రాలేదు. శిక్ష విధించిన తర్వాత కూడా ఎంఎల్ఏ ఎంతోమందని కొట్టారు.

ఇసుక అక్రమ తవ్వకాల్లో ఎంఆర్ఓ వరజాక్షిని కొట్టిన ఘటనలో చింతమనేని రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆ ఘటనలో ఎంఎల్ఏదే తప్పని అధికారులు తేలిస్తే చంద్రబాబునాయుడు మాత్రం ఎంఎల్ఏనే వెనకేసుకొచ్చారు. అప్పటి నుండి ఎంఎల్ఏ రెచ్చిపోతున్నారు. ఆ తర్వాత నుండి పోలీసులను, ఎక్సైజ్ సిబ్బందిని, విజిలెన్స్ పోలీసులను, వైసిపి నేతలను ఇలా..ఎంతమందిపై దౌర్జన్యం చేశారో లేక్కేలేదు.

ఈ ఎంఎల్ఏ దౌర్జన్యాలు భరించలేక జనాలంతా వైసిపి సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలకు దిగారు. దౌర్జన్యం చేయటానికి ఎవరు దొరకలేదేమో తాజాగా టిడిపి నేతపైనే దాడి చేసి కొట్టారు. దాంతో టిడిపి నేతలు, కార్యకర్తలు ఎదురుదాడి చేసి నిర్భందించగా చివరకు క్షమాపణలు చెప్పుకుని బయటపడ్డారు. మరి రేపటి ఎన్నికల్లో దెందులూరు ఓటర్లు ఏం చేస్తారో చూడాలి.