ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, గడప గడపకీ.. అంటూ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. పార్టీని జనంలోకి మరింతగా తీసుకెళ్ళేందుకు, మూడేళ్ళ పాలన తర్వాత ప్రజలు పార్టీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా జిల్లాల పర్యటనలు అధికారికంగా చేసేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం షాక్‌లు తింటున్నారు. తన సభలకు వస్తున్న జనాన్ని, తన ప్రసంగాలతో కట్టిపడేయలేకపోతున్నారు వైఎస్ జగన్. డబ్బులిచ్చి మరీ జనాన్ని తీసుకొస్తున్నా, వాళ్ళేమో.. జగన్ ప్రసంగం ప్రారంభించిన కాస్సేపటికే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వైనం కనిపిస్తోంది.
ఇదిలా వుంటే, మంత్రి రోజాకి ఓ వృద్ధుడి నుంచి చిత్రమైన ప్రశ్న ఎదురయ్యింది ‘గడప గడపకీ వైఎస్సార్సీపీ’ కార్యక్రమంలో. పెన్షన్ తనకు బాగానే అందుతోందని చెప్పిన సదరు వృద్ధుడు తనకు పెళ్ళి చేయాలంటూ కోరడంంతో మంత్రి రోజా బిత్తర పోవాల్సి వచ్చింది.
‘పెన్షన్ అయితే ఇవ్వగలం గానీ.. ఈ వయసులో నీకు పిల్లని ఎలా వెతికి పెట్టగలం.? అది చాలా కష్టమైన విషయం. ఇలాంటి విషయాలు అడిగితే ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు..’ అంటూ సదరు వృద్ధుడితో రోజా నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోపక్క, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ప్రజా ప్రతినిథులకు సెగ ఎదురవుతోంది ప్రజల నుంచి. సమస్యల్ని జనం ఏకరువు పెట్టేస్తోంటే వారికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదు వైసీపీ నేతలకి.