ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన పలు అంశాలపై చర్చించారు. టీడీపీ అధిష్టానం విడుదల చేస్తోన్న శ్వేతపత్రాలు గురించి స్పందించారు. వీటికి వ్యతిరేకంగా వైసీపీ బ్లాక్ పేపర్స్ విడుదల చేస్తామని ప్రకటించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ పై ప్రశ్నల బాణాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలకు సవాల్ కూడా విసిరారు. వీటికి సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి చదవండి.
ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నేళ్లు పాదయాత్ర చేసినా ఆయన అధికారంలోకి రావడం కలే అని ప్రత్తిపాటి ఎద్దేవా చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించట్లేదు? రాజధాని నిర్మాణానికి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంది బీజేపీ. వెనుకబడిన జిల్లాలకు 350 కోట్ల రూపాయలు ఇచ్చి వెనక్కి లాక్కున్నారు. పోలవరం నిర్మాణానికి అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇవన్నీ జగన్ కు కనిపించడం లేదా? వీటిపై జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అని జగన్ ని నిలదీశారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్ర అభివృద్ధిని ప్రధాని కాళ్ళ వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
2019 లో జరిగే ఎన్నికలు ఏకపక్షమేనని జోస్యం పలికారు. 150 సీట్లు టీడీపీవేనని ధీమా వ్యక్తం చేసారు ప్రత్తిపాటి. సీఎం నారా చంద్రబాబు నాయుడు కష్టానికి ప్రతిరూపమే శ్వేత పత్రాలని పేర్కొన్నారు. వాటికి వ్యతిరేకంగా వైసీపీ బ్లాక్ పేపర్స్ విడుదల చేస్తామనడం హాస్యాస్పదం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఏ ఊరిలోనైనా చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా విపక్షాలకు సవాల్ విసిరారు ప్రత్తిపాటి. తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదులో మళ్ళీ జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. జిల్లాలో ప్రత్తిపాడును అగ్రగామిగా నిలబెడతానని తెలిపారు. పక్కచూపులు చూస్తున్న నేతలను పట్టించుకునే పనే లేదని పార్టీ మారే ఆలోచనలో ఉన్న నేతలకు చురకలంటించారు. గుంటూరు జిల్లాలో సభ్యత్వ నమోదు శరవేగంగా జరుగుతోందని తెలియజేసారు.