Nara Lokesh: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో దివ్యాంగ విద్యార్థికి మెడికల్ సీటు

నీట్‌లో మంచి ర్యాంకు సాధించినప్పటికీ, ఇంటర్మీడియట్‌లో ఇంగ్లీష్ సబ్జెక్టు తప్పనిసరిగా చదవలేదన్న నిబంధన కారణంగా మెడికల్ సీటు కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఓ దివ్యాంగ విద్యార్థికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. తిరుపతికి చెందిన దాసరెడ్డి హరిహర బ్రహ్మారెడ్డి సమస్యను తెలుసుకుని, తక్షణమే స్పందించి పరిష్కరించారు.

ఇంగ్లీష్ మినహాయింపు నిబంధనే అడ్డంకిగా మారింది, దాసరెడ్డి హరిహర బ్రహ్మారెడ్డి ఇంటర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో చదివాడు. దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్‌లో మొదటి లేదా రెండో భాషగా ఉన్న ఇంగ్లీషును ఎంచుకోకుండా మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఈ నిబంధనను బ్రహ్మారెడ్డి వినియోగించుకున్నాడు. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో దివ్యాంగుల కేటగిరీలో 1,174వ ర్యాంకు సాధించి, ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందే అర్హత సంపాదించాడు. తొలి విడత కౌన్సెలింగ్‌లో అతనికి తెలంగాణలోని నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు కూడా ఖరారైంది.

అయితే, నీట్ నిబంధనల ప్రకారం ఇంటర్‌లో ఇంగ్లీష్‌ను తప్పనిసరిగా చదివి ఉండాలి. బ్రహ్మారెడ్డి మార్కుల జాబితాలో ఫస్ట్ లాంగ్వేజ్ కాలమ్‌లో మార్కులకు బదులుగా ‘E’ (Exempted) అని ఉండటంతో, అతను మెడికల్ సీటును కోల్పోయే ఆందోళన నెలకొంది.

మంత్రి లోకేశ్ తక్షణ స్పందన

ఈ సమస్యను విద్యార్థి తల్లిదండ్రులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి, గతంలో 25 మంది దివ్యాంగ విద్యార్థుల విషయంలో జారీ చేసిన ప్రత్యేక జీవోను అనుసరించి బ్రహ్మారెడ్డి సమస్యను కూడా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆ జీవో ప్రకారం, ఇంగ్లీష్ సబ్జెక్టులో మినహాయింపు పొందిన విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులైన 35 మార్కులను మార్కుల మెమోలో చేర్చారు.

మంత్రి కార్యాలయం సూచనలతో విద్యార్థి తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి వెళ్లగా, అక్కడ వారికి కొత్త మార్కుల మెమోను అందజేశారు. ఈ నెల 20వ తేదీలోపు కౌన్సెలింగ్ కోసం ఈ మెమోను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. రెండో విడతలో తన కుమారుడికి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు లభించే అవకాశం ఉందని బ్రహ్మారెడ్డి తండ్రి ప్రతాపరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తూ, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశాలకు సంబంధించి ఇలాంటి సమస్యే తలెత్తగా, మంత్రి లోకేశ్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఇప్పుడు అదే తరహాలో నీట్ ర్యాంకర్‌కు కూడా అండగా నిలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

పులివెందుల అన్యాయం || Analyst Chitti Babu EXPOSED Pulivendula ZPTC Election Results || Telugu Rajyam