ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేష్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)ను కించ పరిచేలా వ్యాఖ్యానాలు చేశారు. కోడి కత్తి డ్రామాకు కొత్త డైరెక్టర్ వచ్చాడంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. కోడి కత్తి కేసు అంతర్జాతీయ విచారణ సంస్థకు అప్పగించినా నిజం మారదంటూ లోకేష్ ట్వీట్ చేశారు. కొత్త డైరెక్టర్‌ను పెట్టినంత మాత్రాన ఆ డ్రామా రక్తి కట్టదంటూ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రా మోడీగా సంబోధించారు. ఆంధ్రామోడీని కాపాడటానికి సీబీఐ, బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని ఆయన ఆరోపించారు. `కోడికత్తి కేసు అంతర్జాతీయ విచారణ సంస్థకి అప్పగించినా నిజం మారదు. ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ కోడి కత్తితో యుద్ధానికి కాలు దూస్తున్నారు. తుస్సుమన్న కోడికత్తి డ్రామాకి కొత్త డైరెక్టర్ని పెట్టినంత మాత్రాన రక్తి కట్టదు..` అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ ఒక్క విమర్శ.. నారా లోకేష్ స్థాయి ఏమిటో చెబుతోందంటూ వైఎస్ఆర్ సీపీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. దేశ భద్రతకు పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదుల కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేయడంలో తిరుగులేని సంస్థ ఎన్ఐఎ. జగన్‌పై చోటు చేసుకున్న హత్యాయత్నాన్ని అడ్డు పెట్టుకుని ఎన్ఐఎ లాంటి సంస్థను కించ పరిచేలా వ్యాఖ్యానించడం పట్ల విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని నిషేధించి అభాసుపాలైంది. తాజాగా- ఎన్ఐఎపై కూడా పస లేని విమర్శలు చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.