మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌కి లోన్ యాప్ షాక్.!

Minister Kakani

లోన్ యాప్స్ నిర్వాహకుల కారణంగా దేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అప్పు తీసుకుని, సకాలంలో చెల్లించినా, చెల్లించకున్నా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తగ్గడంలేదు. ఈ క్రమంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు సామాన్యులు.

కేవలం సామాన్యులే కాదు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా లోన్ యాప్ బాధితులే.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎవరో లోన్ తీసుకుని, ఇంకెవరిదో ఫోన్ నంబర్ ఇస్తే.. ఆ ఇంకెవర్నో కూడా వేధిస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బంధువునని చెప్పి అశోక్ కుమార్ అనే వ్యక్తి 8 లక్షలు లోన్ తీసుకున్నాడట. ఆ లోన్ ఆయన చెల్లించకపోవడంతో, అనిల్ కుమార్ యాదవ్‌కి ఆ లోన్ యాప్ నిర్వాహకుల తరఫున ఫోన్ వచ్చింది. 8 లక్షలు చెల్లించాల్సిందేనంటూ దురుసుగా ఓ మహిళ మాజీ మంత్రిని నిలదీసింది.

మంత్రి అనిల్ కూడా అంతకంటే దురుసుగా సమాధానం చెప్పారు. కానీ, లోన్ యాప్ నిర్వాహకులు తగ్గలేదు. మరోపక్క, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికీ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు నలుగుర్ని చెన్నయ్‌లో అరెస్టు చేశారు.

అరెస్టయినవారిని విడిపించేందుకు ఏకంగా 10 మంది ప్రముఖ న్యాయవాదులు రంగంలోకి దిగడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. దేశంలో లోన్ మాఫియా ఇంతలా తెగబడుతున్నా, పోలీసులు మాత్రం తాపీగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.

మంత్రులు, మాజీ మంత్రులకే ఇలాంటి దుస్థితి ఎదురైతే, సామాన్యులకు చావు తప్ప ఇంకో మార్గం ఎలా వుంటుంది.?