హరీష్ రావూ… ఈ వార్త చూశావూ..?

ఏపీలో ప్రభుత్వం ముందు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసుకోవాలి.. ఏపీలో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఒక్కసారి తెలంగాణలో మిషన్ భగీరధ, కాళేశ్వరం ప్రాజెక్టులను చూడాలి. వాటిని ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ వచ్చాక… టీఆరెస్స్ అధికారంలోకి వచ్చాక… కేసీఆర్ పాలనలో, మంత్రిగా తన పనితీరులో తెలంగాణలో చెరువులూ, కుంటలూ అన్నీ నిండిపోయాయి. తెలంగాణ మొత్తం జలకళ వచ్చింది అంటూ కబుర్లు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఇదంతా డొల్ల కబుర్లని చెబుతుంది తాజా నివేధిక!

దేశంలో అత్యధిక చెరువులు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అత్యధిక కుంటలు, రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలవగా.. ఊటకుంటలు, చెక్ డ్యామ్ లు లాంటి జల సంరక్షణ నిర్మాణాల్లో మహారాష్ట్ర ముందు స్థానంలో నిలిచింది.

ఇదే క్రమంలో… అత్యధిక రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఐదోస్థానంలో నిలవగా.. అత్యధిక జలసంరక్షణ నిర్మాణాలు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే… వీటిల్లో ఎందులోనూ తెలంగాణ రాష్ట్రం లేదు. దేశంలో “జలవనరుల మొదటి గణన, చిన్న నీటివనరులు ఆరో గణన”కు సంబంధించిన ఫలితాల్ని తాజాగా కేంద్ర జల శక్తి శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా కీలక వివరాల్ని వెల్లడించింది.

ఏపీలో మొత్తం 1,13,425 చెరువులు ఉంటే అందులో 1,03,952 చెరువులు వినియోగంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇదేక్రమంలో… చిన్ననీటి వనరుల కింద దేశంలో 14.75 కోట్ల హెక్టార్ల భూమి ఉండగా.. ఇందులో అత్యధిక ఆయుకట్ట ఉన్న రాష్ట్రాల్లో 1.199 కోట్ల హెక్టార్ల భూమితో తమిళనాడు తొలి స్థానంలో ఉంది. అనంతరం 54.28 లక్షల హెక్టార్ల భూమితో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.

దేశంలో జనలవరుల్లో 78 శాతం మానవ నిర్మితం కాగా.. 22 శాతం మాత్రం సహజసిద్ధంగా ఏర్పడినవని పేర్కొన్న జల్ శక్తి మంత్రిత్వ శాఖ… జనవరుల్లో 83.7 శాతం వినియోగంలో ఉంటే.. 16.3 శాతం ఎండిపోయినట్లు చెబుతుంది. ఇక ఈ జలవనరుల్లో పశ్చిమ బెంగాల్ 30.8 శాతంతో తొలి స్థానంలో నిలిస్తే.. 10.1 శాతంతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో.. 7.9 శాతంతో ఏపీ మూడో స్థానంలో నిలిచాయి. 7.5 శాతంతో ఓడిశా నాలుగో స్థానంలో.. 7.1 శాతంతో అసోం ఐదో స్థానంలో నిలిచాయి. వీటిల్లో ఎందులోనూ తెలంగాణ లేకపోవటం గమనార్హం.

ఈ విషయాలు తెలియకో.. లేక, తెలుగు ప్రజలను ఏమార్చాలనో తెలియదు కానీ… ఇరిగేషన్ లో తెలంగాణ దేశానికే ఆదర్శమని, ఏపీ మంత్రులు తెలంగాణ ఇరిగేషన్ లో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను చూడాలని బడాయి కబుర్లు చెబుతుంటారు హరీష్ రావు. దీంతో… ఈ నివేధికలను వైరల్ చేస్తున్నారు ఏపీ వాసులు! ఈ రిపోర్ట్ చూసినతర్వాతైనా… హరీష్ ఇకపై బడాయి కబుర్లు మానేసి.. ఏపీని చూసి నేరుచుకుంటారో లేదో వేచి చూడాలి!