మంత్రిగారి ‘కోడి – గుడ్డు’ కథ.! అవసరా ఇదంతా.?

మైద్రాబాద్‌లో పార్ములా వన్ ఇ-రేసింగ్ జరుగుతోంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటివెప్పుడు.? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ‘సమీప భవిష్యత్తులో’ అని చెప్పి వుంటే సరిపోయేది. కానీ, అలా చెబితే ఆయన ఏపీ మంత్రి ఎలా అవుతారు.? ‘కోడి – గుడ్డు’ అంటూ ఏదో కథ చెప్పారు. ‘కోడి కేవలం గుడ్డుని మాత్రమే పెట్టగలదు.. కోడి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడిని పెట్టలేదు కదా.? గుడ్డుని కోడి పెట్టాలి.. ఆ గుడ్డు పొదగబడాలి.. ఆ తర్వాత అందులోంచి పిల్ల బయటకు వస్తుంది..’ అని చెబుతూ, ‘ఫార్ములా వన్ లాంటివి ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి సమయం పడుతుంది..’ అని అర్థం వచ్చేలా మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించే ప్రయత్నం చేశారు.

ఇక్కడ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎవరు అమాయకులని, ఇంత వివరణ ఇచ్చారు.? మీడియానా.? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనా శక్తి మీద ఆయనకు అనుమానాలుండే ఇంత వివరణ ఇచ్చారని అనుకోవాలా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది. ఐటీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న విషయాలపై గుడివాడ అమర్నాథ్‌కి సరైన అవగాహన లేదన్న విమర్శలున్నాయి. ఆయన ఐటీ శాఖ మంత్రి అయ్యాక, ఒక్కటంటే ఒక్క ఐటీ ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి వచ్చింది లేదు. సరే, ఆంధ్రప్రదేశ్ ‘ప్రత్యేక పరిస్థితి’ ఏంటన్నది జగమెరిగిన సత్యం.

కానీ, మంత్రులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా.! ఇలా అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తే, నష్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే అవుతుంది. రాష్ట్రానికి నస్టం సంగతి సరే సరి. పార్టీ, ప్రభుత్వం సైతం నష్టపోయేలా ఇంత తేలికైన వ్యాఖ్యలు మంత్రులు చేయడం హాస్యాస్పదమే.