అఖిలప్రియతో పెట్టుకుంటే అంతే సంగతులు

ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ సివియర్ వార్నింగ్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తనను ఓడించటానికి తన ప్రత్యర్ధులంతా ఆళ్ళగడ్డలో ఏకమవుతున్నట్లు అఖిల అనుమానిస్తున్నారు. అదే విషయాన్ని మద్దతుదారులు, కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించారు. ఇంతకీ మంత్రి ఏమన్నారంటే, వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు తన నియోజకవర్గంలో ప్రత్యర్ధులందరూ ఏకమయ్యారంటూ మండిపడ్డారు. తాను ఎన్నికల్లో గెలిచిన తర్వత తన ప్రత్యర్ధుల్లో ఎవరినీ వదిలేది లేదంటూ అందరికీ కలిపి పెద్ద వార్నింగే ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నవారేవరో కూడా తనకు తెలుసంటూ కోపంతో ఊగిపోయారు.

 

భూమా అఖిలకు వ్యతిరేకంగా ఆళ్ళగడ్డలో పవర్ ఫుల్లు నేత ఇరిగెల రాం పుల్లారెడ్డి టిడిపికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అఖిల భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆమె వైఖరి నచ్చకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇరిగెల బహిరంగంగా ప్రకటించిన విషయం అందరూ చూసిందే. అప్పటికే మరో సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి కూడా భూమాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. విచిత్రమేమిటంటే, తండ్రి,  దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవికి కూతురు అఖిలతో మాత్రం పడలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

 

ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించకుండానే అఖిల తన ప్రత్యర్ధులకందరికీ కలిపి ఒకే వార్నింగ్ ఇచ్చేశారు. తన జోలికిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ ఘాటుగానే హెచ్చరించారు. నంద్యాలలో గెలవలేని వారు కూడా తనను ఓడిస్తామని ప్రతిజ్ఞలు చేస్తున్నారంటూ (ఇరిగెల) ఎద్దేవా చేయటం గమనార్హం. ఆళ్ళగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో గెలిచి చంద్రబాబునాయుడుకు కానుకగా ఇస్తానంటూ ప్రకటించారు. తాను గెలిచిన తర్వాత ఏ ఒక్కళ్ళని వదిలిపెట్టనంటూ బహిరంగంగా చేసిన హెచ్చరికలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి.