వదల బొమ్మాళి నిన్నొదల అనే పాపులర్ డైలాగ్ ఒకుటుంది. అదే విధంగా కొణిదల బ్రదర్స్ చంద్రబాబునాయుడును నీడలా వెంటాడుతున్నారు. నీడలా వెంటాడుతున్నారంటే చంద్రబాబును కాపాడటానికి కాదు సుమ. ఓడగొట్టటానికేనట. తాజాగా వెల్లడైన ఫలితాల్లో జనసేన దెబ్బ తెలుగుదేశంపార్టీకి గట్టిగా తగిలిందని టిడిపి నేతలు ఇపుడు బోరుమంటున్న విషయం అందరికీ తెలిసిందే. సుమారు 36 నియోజకవర్గాల్లో జనసేన దెబ్బ టిడిపికి పడిందని చెప్పుకుంటున్నారు.
నిజానికి పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించిందే చంద్రబాబు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చటానికి వైసిపి అభ్యర్ధులను దెబ్బకొట్టటానికే జనసేన అభ్యర్ధులను చంద్రబాబు రంగంలోకి దించారు. కాకపోతే చంద్రబాబు ఒకటనుకుంటే పోలింగ్ రోజు జరిగింది మరోటి. వైసిపిని దెబ్బ కొడదామని అనుకుంటే చివరకు టిడిపినే జనసేన దెబ్బకు బలైపోయిందట.
సీన్ కట్ చేస్తే 2009లొ కూడా ఇదే విధమైన దెబ్బ ప్రజా రాజ్యంపార్టీ నుండి టిడిపికి పడింది. అప్పట్లో కూడా కాంగ్రెస్, టిడిపి, ప్రజా రాజ్యం పార్టీ మధ్య ముక్కోణపు పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజా రాజ్యం పార్టీ దెబ్బ ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఫలితాల తర్వాత చూస్తే ప్రజా రాజ్యం పార్టీ దెబ్బ టిడిపికే తగిలింది.
దానికి తోడు లోక్ సత్తా పార్టీ దెబ్బ కూడా టిడిపికి బాగా తగిలింది. దాంతో సుమారు 90 నియోజకర్గాల్లో టిడిపి అభ్యర్ధులు తక్కువ తేడాతో ఓడిపోయారు. అంటే అర్ధమవుతున్నదేమంటే కొణిదెల బ్రదర్స్ చంద్రబాబును వదల బొమ్మాళి అంటూ గట్టిగా పట్టుకున్నారట.