చంద్రబాబు నాయుడు (టిడిపి), జగన్మోహన్ రెడ్డి (వైసిపి) కాకుండా మరొక కొత్త నాయకుడు రాజకీయాల్లోకి రావాలని, తమను పాలించాలని ఆంధ్రప్రజలు ప్రజలు కోరుకుంటున్నారని బహుజన్ సమాజ్ వాది పార్టీ మాయావతి అన్నారు.
ఆమె ఈ రోజు విశాఖపట్నంలో జనసేన నేత పవన్ కల్యాణ్ తో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారని, యువకుడు మార్పు తీసుకురాగల సమర్థుడు పవన్ కల్యాణేనని ఆమె ప్రశంసించారు.
బిఎస్ పి-జనసేన- వామ పక్షాల కూటమి వస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రకటించారు. ఈ మార్పు రావాలని ప్రజలంతా ఉత్కంఠతో వేచి చూస్తున్నారని కూడా ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధప్రజలు తమ కూటమికి, దేశ ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీకి ఈ లోక్ సభ ఎన్నికల్లో పట్టం కడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ఇక్కడ జనసేన నేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ప్రజలు హ్యాపీ గా ఉండేందుకు మా కూటమి పని చేస్తుంది,’ అని మాయావతి చెప్పారు. పవన్ మాట్లాడుతూ తాము మాయావతి ప్రధాని కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.
తెలంగాణ,ఆంధ్రలలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆమె చెప్పారు. ‘ ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా ప్రజలనుకున్నవి నెరవేరడం లేదని, ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి చేయలేకపోతున్నాయని ఆమె అన్నారు.
‘మాయావతి ప్రధానమంత్రి కావాలనేది మా కోరిక. ఆమె అనుభవం ఈ దేశానికి కావాలి, ఈ దేశానికి ఆమె మార్గదర్శకత్వం అవసరం. ఎందరో దళిత ఉద్యమ నాయకులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్, బీజేపీ తర్వాత పెద్ద పార్టీ బీఎస్పీనే’’ అని పవన్ ప్రశంసించారు.
ఈ సందర్భంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణలో కెసియార్ చేసిన హామీని కూడా గుర్తు చేశారు. ఈ హామీ మీద కెసియార్ ఎందుకు వెనక్కుపోయారో చెప్పనే లేదని అన్నారు. తాము మాత్రం దళిత నేత దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నామని అన్నారు.