అవును ఎక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్ నేతలు చంద్రబాబునాయుడు కు షాక్ ఇవ్వటమేంటని అనుకుంటున్నారా ? నిజమే ఇద్దరూ కలిసే చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఎలాగంటే త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ లో పై ఇద్దరు నేతలు కలిసి కాంగ్రెస్ పార్టీని దాదాపు తన్ని తిరిమేసే పనిలో ఉన్నారు. దేశం మొత్తం మీద బిజెపియేతర పార్టీలను ఏకం చేస్తానని కదా చంద్రబాబు దేశమంతా తిరుగుతున్నారు ? నిజానికి బిజెపియేతర పార్టీల్లో చాలా వరకూ ఇప్పటికే యూపిఏలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అదేదో తాను మొదటుపెట్టిన తర్వాతే చాలా పార్టీలు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నాయనే బిల్డప్ ఇస్తున్నారు చంద్రబాబు.
సరే చంద్రబాబు పర్యటనల వల్ల కొత్తగా కాంగ్రెస్ కు ఒక్క మిత్రపక్షమైనా వచ్చింది అంటే అదీ లేదు. అయినా జనాల చెవుల్లో పూలు పెడుతున్నానని అనుకోవటమంటే చంద్రబాబుకు అదో సరదా. ఇక ప్రస్తుత విషయానికి వస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఎస్పీ, బిఎస్పీ అధినేతలు అఖిలేష్ యాదవ్, మాయావతి తాజాగా నిర్ణయించారు. యుపిలో మొత్తం 80 ఎంపి సీట్లున్నాయి. అందులో ఎస్పీ 38 సీట్లలో, బిఎస్పీ 37 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని స్ధూలంగా నిర్ణయానికి వచ్చారట. అంటే 75 సీట్లలో పై రెండు పార్టీలే పోటీ చేస్తాయన్నమాట. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో చిన్నా, చితకా పార్టీలకు మూడు సీట్లిచ్చి కాంగ్రెస్ పార్టీకి 2 నియోజకవర్గాలను కేటాయించారు. ఆ రెండు కూడా ఏవంటే సోనియా గాంధి, రాహూల్ గాంధిలు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయబరేలి నియోజకవర్గాలు కావటం గమనార్హం.
అంటే, అఖిలేష్, మాయావతిల వైఖరి చూసిన తర్వాత కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా వదిలేందుకు ఇష్టం పడటం లేదన్నది అర్ధమైపోతోంది. సోనియా, రాహూల్ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అమేథీ, రాయబరేలీలు వదిలేసినట్లుంది చూడబోతే. అంటే కాంగ్రెస్ పార్టీని పై ఇద్దరు నేతలు ఒక ప్రాంతీయ పార్టీగా కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. నిజానికి ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్దితి అలాగే ఉంది. కాంగ్రెస్ ఏమో తమకు కనీసం 15 సీట్లు కావాలని అడుగుతోందట. అసలు రెండు సీట్లు ఇవ్వటమే ఎక్కువనుకుంటున్నపుడు 15 సీట్లు ఇస్తారా ? గట్టిగా పట్టుబడితే మహాఉంటే మరో రెండు సీట్లు ముష్టి వేసినట్లు వేస్తారేమో తెలీదు.
ఇది ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన పొత్తుల ముఖచిత్రం. మరి ఈ పరిస్ధితుల్లో కాంగ్రెస్ కు ఆపద్భాందవునిగా కనిపిస్తున్న చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే, దేశమంతా ఇపుడు చంద్రబాబు తిరుగుతున్నది కాంగ్రెస్ ను బలోపేతం చేయటానికే కదా . మరి యుపిలో కాంగ్రెస్ పరిస్ధితేంటో వాళ్ళకే అర్ధం కావటం లేదు. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటిరి పోటీకే ఆలోచిస్తున్నట్లు రాహూల్ కూడా చెబుతున్నారు. దేశం మొత్తం మీద ఎంతో కీలకమైన యుపిలో ఎస్పీ, బిఎస్పీలు కాంగ్రెస్ ను లెక్క చేయకపోతే ఇక మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను ఎవరు పట్టించుకుంటారు ? జాతీయస్ధాయిలో కాంగ్రెస్ కు అధికార ప్రతినిధిలాగ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు మాటను యుపిలో ఇద్దరు అధినేతలు లెక్కచేసేట్లు లేరు. అంటే అఖిలేష్, మాయావతిలు చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చినట్లే.