జనసైనికులు అనుకున్నంతా అయ్యింది… వైసీపీలోకి కందుల దుర్గేష్!

ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ కి సంబంధించి ఒక కార్టూన్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా చెట్టుకొమ్మపై నిల్చుని మరీ… పవన్ తాను నిల్చున్న కొమ్మను తానే గొడ్డలితో నరికేసుకుంటూ ఉంటారు! అయితే… గతకొన్ని రోజులుగా జనసేనలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… ఆ కార్టూన్ కు న్యాయం చేసినట్లే ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీకోసం ప్రాణం పెట్టిన నేతలను, కార్యకర్తలను దూరం చేసుకున్న పవన్… ఇప్పుడు కందుల దుర్గేష్ విషయంలోనూ అదే చేస్తున్నారని అంటున్నారు!

జనసైనికులు అనుకున్నంతా అవుతుంది! పొత్తులో భాగంగా జనసేనకు 40 – 50 స్థానాలు దక్కకపోతే పార్టీలో అంతర్గత యుద్ధం మొదలవుతుందని.. ఆ యుద్ధంలో చనిపోయేది నేతలు కాదు పార్టీ అని.. ఎటు పోవాలో తెలియక ఇబ్బంది పడేది తామే అని జనసైనికులు ఎన్నోసార్లు మొత్తు కున్నారు. హరిరామ జోగయ్య లాంటి వారు లేఖల మీద లేఖలు రాశారు. పవన్ మాత్రం అధినేత చంద్రబాబు చెప్పిన దానికి తలాడించడం మినహా మరో ప్రయత్నం చేసినట్లు లేదు!!

దీంతో 24 స్థానాలు విదిల్చారు చంద్రబాబు! పోనీ ఆ టిక్కెట్ల ప్రకటన రోజే జనసేన పోటీచేయబోయే స్థానాల పేర్లు అయినా ప్రకటించి ఉంటే… ఒక క్లారిటీ వచ్చేది. తాడో పేడో ఆరోజే జనసేనకు స్పష్టత వచ్చేది. అయితే ఎప్పుడో అనుకున్న ఐదు నియోజకవర్గాల పేర్లు మాత్రం ప్రకటించి సైలంట్ అయిపోయారు పవన్. మిగిలిన 19 పరిస్థితి ఏమిటయ్యా అంటే… టీడీపీ నేతలు మిగిల్చినవి అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి.

ఈ నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో పి.గన్నవరం, తణుకు, జగ్గంపేట, కొత్తపేట మొదలైన స్థానాల్లో ఇప్పుడు టీడీపీ వర్సెస్ జనసేన ఫైట్ జరుగుతుంది. భౌతికంగా ఈ నియోజకవర్గాల్లో కనిపిస్తున్నా… చాలా చోట్ల ఈ పరిస్థితి ఉందని… దీని ఎఫెక్ట్ చాపకింద నీరులా కాపుసమాజంలో పాకుతుందని… దీంతో, ఓటు ట్రాన్స్ ఫర్ ఆల్ మోస్ట్ అసాధ్యమనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో రాజమండ్రి రూరల్ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రాజమండ్రి రూరల్ సీటు తనకే అని జనసేన అధినేత కందుల దుర్గేష్ తో ఇప్పటికి కొన్ని వందల సార్లు చెప్పారని అంటుంటారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చీఫ్ గా ఉన్న కందుల దుర్గేష్ పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారిందని అంటున్నారు. ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని జనసైనికులు, ఆయన అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయనకు నిడదవోలు ఆఫర్ చేశారంట చంద్రబాబు – పవన్!

మరోపక్క… కందుల దుర్గేష్ ను నిడదవోలు రానిచ్చేది లేదంటూ అక్కడి టీడీపీ కార్యకర్తలు హుకుం జారీ చేశారంట. దీంతో కందుల దుర్గేష్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో… కందుల దుర్గేష్‌ పై రాజ‌మండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీలోకి ఆయనను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఈ సందర్భంగా స్పందించిన భరత్… దుర్గేష్ మంచి మ‌నిష‌ని.. అలాంటి నాయ‌కుడు గ‌త ఎన్నిక‌ల్లో త‌మ పార్టీలో వుండింటే ఈ పాటికి ఎమ్మెల్యే, మంత్రి కూడా అయ్యి వుండేవారని.. రైట్ ప‌ర్సన్ రాంగ్ పార్టీలో వున్నాడ‌ని భ‌ర‌త్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో… కందుల దుర్గేష్‌ ను త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు భరత్ తెలిపారు. ఈ నేపథ్యంలో… కందుల దుర్గేష్‌ ను వైసీపీలో చేర్చుకునేందుకు క్షేత్రస్థాయిలో పావులు క‌దుపుతున్నట్టు తెలుస్తుంది.

ఇదే సమయంలో పవన్ ప్రవర్తన.. క్రెడిబిలిటీ లేని తనం.. స్థిరత్వం లేని నైజం.. చంద్రబాబు వద్ద ఆయన కనబరిచే బానిసత్వ పోకడలు.. ప్రతీదానికీ తలాడించే లక్షణం.. మొదలైన వాటితో కందుల దుర్గేష్ విసిగిపోయారని.. ఆయనతో పాటు జనసైనికులు అలసిపోయారని.. ఎంత సమర్ధించుకున్నా పవన్ పద్దతిలో మార్పు రావడం లేదని భావిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో కందుల దుర్గేష్ త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది.