గతంలో ఎన్నడూ లేనంతగా మంత్రులపై అసమ్మతి సెగ బాగా ఎక్కువైపోయింది. మంత్రులన్నాక అసమ్మతి తప్పదు. కానీ ఏకంగా ఇప్పటి మంత్రుల్లో కొందరిపై నియోజకవర్గాల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది. వ్యతిరేకత పెరగటమే కాకుండా వచ్చే ఎన్నికల్లో అసలు టిక్కెట్లే ఇవ్వద్దంటూ చంద్రబాబునాయుడుకే ఫిర్యాదులు చేసేంత స్ధాయిలో అసమ్మతి పెరిగిపోయిందంటే ప్రమాధ ఘంటికలు మొగుతున్నట్లే అనుకోవాలి. పశ్చిమగోదావరి కొవ్వూరులో మంత్రి జవహర్ కు టిక్కెట్టు ఇవ్వదంటూ కొవ్వూరులో పార్టీ నేతలు ఈరోజు హడావుడి చేయటం విచిత్రంగా ఉంది.
జవహర్ వైసిపి నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్ధానిక నేతలు ఆరోపిస్తున్నారు. ఏదైనా పని మీద మంత్రి దగ్గరకు వెళితే సొంతపార్టీ నేతలను కాదని వైసిపి నేతలు సిఫారసు చేసిన వారికే పనులు చేసిపెడుతున్నట్లు మండిపోయారు. అమరావతిలోని సచివాలయంలో సీనీయర్ నేతలను కొవ్వూరు నేతలు కలిసి మంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయటం గమనార్హం. తమ ఫిర్యాదులను కాదని పార్టీ జవహర్ కే టిక్కెట్టిస్తే గెలుపు గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పటం విడ్డూరంగా ఉంది.
మంత్రులపై అసమ్మతి అన్నది ఒక్క జవహర్ కు మాత్రమే పరిమితం కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు, కమిడి కళా వెంకట్రావుల మీద కూడా స్ధానిక నేతలు ఫిర్యాదులు చేశారు. విశాఖపట్నం జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు మీద కూడా ఫిర్యాదులున్నాయి. విజయనగరం జిల్లాలో ఫిరాయింపు మంత్రి సుజయ కృష్ణ రంగారావు మీదైతే ఫిరాయింపులకు కొదవే లేదు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో జవహర్ తో పాటు పితాని సత్యనారాయణ మీద కూడా స్ధానిక నేతలు మండిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మకాయల చినరాజప్పను స్ధానిక నేతలు అసలు లెక్కే చేయటం లేదు.
ఇక కడప జిల్లాలో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఉన్న ఫిర్యాదుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కర్నూలు జిల్లాలో మరో ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియకు టిక్కెట్టిస్తే రాబోయే ఎన్నికల్లో ఓడిస్తామంటూ స్దానిక నేతలు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. అలాగే, నెల్లూరు జిల్లాలోని ఇద్దరు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య సఖ్యత లేదు. ఇద్దరిపైన వారి నియోజకవర్గాల్లో స్ధానిక నేతలు మండిపోతున్నారు. కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై అసమ్మతి చాపక్రింద నీరులాగ పాకిపోతోంది. మొత్తం మీద మంత్రివర్గంలోని సుమారు 11 మంది మంత్రులు తమ నియోజకవర్గాల్లో తీవ్రమైన అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎంతమంది గెలుస్తారో చూడాల్సిందే.