మాగుంట ఔట్ …చంద్రబాబుకు షాక్

తెలుగుదేశంపార్టీ నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ నుండి తప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా మాగుంటను పోటీ చేయించటానికి చంద్రబాబునాయుడు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే, ఒంగోలులో పోటీ చేయటానికి మాగుంట తప్ప టిడిపికి మరో దిక్కులేదు. అందుకనే మాగుంటపై చంద్రబాబు కొన్ని నెలలుగా ఒత్తిడి పెడుతున్నారు. అయితే, రాబోయే ఎన్నికల్లో టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మాగుంటలో లేదు. పైగా టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరటానికి మాగుంట రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం తెలిసిందే.

వైసిపిలోకి మాగుంట వెళ్ళకుండా చంద్రబాబు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మొత్తానికి ఏదోరకంగా బ్రతిమాలి ఒంగోలు ఎంపిగా పోటీ చేయించేట్లు మాగుంటను ఒప్పించారు. చంద్రబాబు ఒత్తిడి మీద పోటికి ఒప్పుకున్నారే కానీ నిజానికి మాగుంట మనసంతా వైసిపిలోనే ఉంది. మళ్ళీ తెరవెనుక ఏం జరిగిందో స్పష్టంగా తెలీదు కానీ చంద్రబాబును కలిసి ఎంపిగా పోటీ చేయనంటూ స్పష్టంగా చెప్పేశారు. తనకు వ్యాపారాలున్నాయని కొన్ని సమస్యల కారణంగా పోటీ చేయలేక పోతున్నట్లు చెప్పటంతో చంద్రబాబు కూడా ఏమీ చేయలేకపోయారు.

అయితే, వాస్తవం మాత్ర ఇంకో విధంగా ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. గెలుపు అవకాశాలు, పార్టీ పరిస్ధితిపై మాగుంట నియోజకవర్గంలో సర్వే చేయించుకున్నారట. గెలుపు అవకాశాలు లేవని, టిడిపి మళ్ళీ అధికారంలోకి వచ్చే సీన్ లేదని తేలిందట. దాంతో ఓడిపోయే సీటుకు కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలని మాగుంట ఆలోచించారట. అందుకనే పోటీ నుండి తప్పుకుంటున్నట్లు చెప్పేశారు. దాంతో షాక్ కు గురైన చంద్రబాబు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నారు.