అయినా, రామోజీరావు మీద అంత ప్రేమ ప్రదర్శించాల్సిన అవసరం జనసేన నేత నాగబాబుకి ఏమొచ్చింది.? అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ‘జెండా పీకేద్దాం’ అంటూ దుష్ప్రచారాన్ని తొలుత తెరపైకి తెచ్చింది ‘ఈనాడు’ రామోజీరావే కదా.? ‘మమ్మల్ని నాశనం చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తున్నాయ్..’ అంటూ చిరంజీవి అప్పట్లో కంటతడి పెట్టినంత పని చేశారు.. అదీ ప్రజారాజ్యం పార్టీ అధినేత హోదాలో.! సరే, ‘ఈనాడు’ చెప్పిందే నిజమైంది.. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కలిపేశారు.. ఇవన్నీ వేరే విషయాలే.
ఆనాటి ఆ గాయం నుంచి చిరంజీవి ఇంకా కోలుకుని వుండరు. కానీ, ఆయన తమ్ముడు నాగబాబు మాత్రం, ‘నాకేటి సంబంధం.?’ అన్నట్లు ఆనాటి వ్యవహారం విషయమై వ్యవహరిస్తున్నారు. లేకపోతే, రామోజీరావుని ఏపీ సీఐడీ ‘మార్గదర్శి’ కేసులో విచారిస్తే, నాగబాబుకి ఎందుకు నొప్పి కలిగింది.? ఇప్పటిదాకా చంద్రబాబు విషయంలో చీమ చిటుక్కుమన్నా జనసేన కంగారు పడుతుందనే విమర్శ వుంది. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా విషయంలోనూ జనసేన అలాగే కంగారు పడుతోందా.? అన్న చర్చ తెరపైకొచ్చింది.
నాగబాబు స్పందనని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ‘దీన్ని రాజకీయ కోణంలోనే చూడాలి.. నాగబాబుని తూలనాడొద్దు..’ అని జనసేన నేతలు కొందరు చెబుతున్నా, నాగబాబు చేసిన డ్యామేజీ అంతా ఇంతా కాదన్నది జనసైనికుల ఆవేదన.