చంద్రబాబునాయుడు కాస్ట్లీ అని తెలుసు కానీ మరీ ఇంత కాస్ట్లీ అని తెలీదు. తెలిసే సరికి ఉన్నతాధికారుల కళ్ళే బైర్లు కమ్మాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, వివిథ సందర్భాల్లో చంద్రబాబు గుంటూరులో పర్యటించారు. ప్రతీ కార్యక్రమాన్నీ చంద్రబాబు మెగా ఈవెంట్ క్రిందనే ట్రీట్ చేయటం, అందుకు తగ్గట్లే ఉన్నతాధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటం మామూలైపోయింది.
ఆ విధంగా పెట్టిన ఖర్చుల్లో ఒక్క గుంటూరు జిల్లాల్లో మాత్రమే రూ. 18. 26 కోట్లు ఖర్చయిందట. అందులో కూడా గోదావరి పుష్కరాల సందర్భంగా కుటుంబంతో కలిసి స్నానం చేయటానికి చంద్రబాబు గుంటూరుకు వచ్చారు. అప్పుడు అయిన ఖర్చు రూ. 2.41 కోట్లట. ఆ తర్వాత మహాసంకల్పం కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తే అయిన ఖర్చు రూ .3. 05 కోట్లు.
గడచిన రెండేళ్ళుగా జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు సుమారు 13 కోట్ల రూపాయలు వ్యయం అయ్యింది. ఇపుడీ విషయం ఎలా బయటకు వచ్చిందంటే చంద్రబాబు కార్యక్రమాలకు పెట్టిన ఖర్చంతా వివిధ ఏజెన్సీలు పెట్టుకున్నాయి. ముందుగా ఆ ఏజెన్సీలు ఖర్చులను పెట్టుకుంటే తర్వాత ప్రభుత్వం రీ ఎంబర్స్ చేస్తుంది. కానీ గడచిన రెండేళ్ళుగా ప్రభుత్వం నుండి బిల్లులు రీ ఎంబర్స్ కాకపోవటంతో ముందుగా ఖర్చులు పెట్టుకున్న ఏజెన్సీలు లబోదిబోమంటున్నాయి. డబ్బుల కోసం వాళ్ళంతా కలెక్టర్ పై ఒత్తిడి పెట్టటంతో కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ విధంగా చంద్రబాబు ఖర్చుల భాగోతం బయటపడ్డాయి.