నారా లోకేష్ ఆరాటం.! అట్నుంచి అందేనా ఆపన్నహస్తం.?

విమర్శించిన నోటితోనే, బీజేపీని పొగడక తప్పని పరిస్థితి ఏర్పడింది తెలుగు తమ్ముళ్ళకి. పొగడటమేంటి.? కాళ్ళ బేరానికి వెళ్ళాల్సిందే.! జనసేన విషయంలోనూ టీడీపీకి అదే జరిగింది. బీజేపీ విషయంలోనూ బీజేపీకి అదే జరగబోతోంది.

కేంద్ర మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ భేటీ వెనుక చాలా కథలే నడిచాయి. మాజీ కేంద్ర మంత్రి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరీశ్వరి మాత్రమే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చక్రం తిప్పాల్సి వచ్చింది. ఇంత జరిగితేనే లోకేష్ – అమిత్ షా మధ్య భేటీ సాధ్యమయ్యిందట.

అయితే, బీజేపీ అధినాయకత్వం మాత్రం ఇంకా ఇంకా బతిమాలించుకోవాలనే ఆలోచనలో వుందిట.! ‘జనసేనకు సంపూర్ణ మద్దతిస్తున్నాం..’ అని బాలకృష్ణతోనూ, నారా లోకేష్‌తోనూ ఎలాగైతే చంద్రబాబు చెప్పించారో, అంతకు మించిన స్థాయిలో, బీజేపీకి కూడా టీడీపీ నుంచి క్షమాపణ చెప్పించుకునేందుకే కమలం పెద్దలు వేచి చూస్తున్నారట.

‘చంద్రబాబు జైలుకు వెళ్ళడంలో బీజేపీ ప్రమేయం ఏమీ లేదు..’ అంటూ నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించేశారు. ఆ తర్వాతే లోకేష్ – అమిత్ షా భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అవసరం టీడీపీకి ఎంతైనా వుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ జైలు నుంచి బయటకు రావాలంటే, కేంద్ర ప్రభుత్వ పెద్దల సాయం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ పెద్దలంటే, బీజేపీ అధినాయకత్వమే కదా.! ‘మేమే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాం..’ అని చంద్రబాబుకి బల్లగుద్ది మరీ చెప్పేలా, బీజేపీ అధినాయకత్వం వ్యూహం సిద్ధం చేస్తోందిట.

ప్రస్తుతానికైతే లోకేష్ – అమిత్ షా భేటీ తర్వాత కూడా బీజేపీ – టీడీపీ మధ్య ఎలాంటి సానుకూల వాతావరణమూ లేనట్టే కనిపిస్తోంది. కానీ, ముందు ముందు ఈక్వేషన్ మారబోతోంది.! తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో లింకు లాభమా.? నష్టమా.? అన్నదానిపై ఓ నిర్ధారణకు వచ్చాకే, బీజేపీ తగు నిర్ణయం తీసుకోబోతోందిట.!