తోడల్లుడికి షాకిచ్చిన లోకేష్

అవును సోదర సమానుడు, తన తోడల్లుడైన శ్రీ భరత్ కు లోకేష్ పెద్ద దెబ్బే కొట్టారు. రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ నుండి పోటీ చేయటానికి భరత్ రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే విశాఖపట్నం జిల్లాలోని భీమిలి కానీ లేదా విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కానీ స్వయంగా లోకేష్ పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో దగ్గరి బంధువులు ఇద్దరూ ఒకే జిల్లా నుండి పోటీ చేయటం సాధ్యం కాదని చంద్రబాబానాయుడు చెప్పేశారట. దాంతో భరత్ పోటీ నుండి తప్పుకోవాల్సిన పరిస్ధితులు వచ్చాయి.

నిజానికి లోకేష్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే విషయమై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన లోకేష్ ఎంఎల్సీ అయి దొడ్డిదోవన మంత్రయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి లోకేష్ సామర్ధ్యంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. దాంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక చివరకు ఎంఎల్ఏగా పోటీ చేయాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. హిందుపురం, కుప్పం స్ధానాల్లో ఏదో ఒకదాని నుండి పోటీ చేస్తారని అనుకున్నారు.

అయితే, అనూహ్యంగా విశాఖ జిల్లా భీమిలీ నుండే పోటీ చేయటం ఖాయమంటున్నారు. అదే సమయంలో విశాఖ ఎంపిగా పోటీ చేసేందుకు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఎప్పటి నుండో వేదిక రెడీ చేసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా లోకేష్ చూపు విశాఖ జిల్లాపై పడటంతో భరత్ పోటీకి గండం వచ్చింది. అంటే కుప్పంలో చంద్రబాబు, హిందుపురంలో బాలకృష్ణ, భీమిలీ కానీ లేదా విశాఖఉత్తరం నుండి లోకేష్ పోటీ చేయబోతున్నారన్నమాట. మొత్తానికి తోడల్లుడు, తమ్ముడైన భరత్ ను ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పించటంలో లోకేష్ సక్సెస్ అయినట్లే