వైసీపీలో కొందరు నేతల తీరు వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతర్గత కలహాలతో, ఆధిపత్య పోర్టులో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు రచ్చకెక్కారు. వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరినొకరు తక్కువ చేసే కుట్రలు జోరుగా సాగుతున్నాయి. వీరి మధ్యన సయోధ్య కుదర్చడానికి మంత్రులు, జిల్లా పెద్దలు ప్రయత్నిస్తున్నా కుదరట్లేదు. ఇది ఒక వర్గం అయితే వైసీపీలో ఇంకొక వర్గం తయారై కూర్చుంది. వీరి మీద తోటి నాయకుల్లోనే కాదు జనంలో కూడ వ్యతిరేకత గూడు కట్టుకుని ఉంది. ఎన్నికలయ్యాక కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు, పార్టీ కేడర్ కు దూరం జరిగేశారు. సొంత పనులు, సొంత మనుషులు, సొంత వ్యాపారాలు అంటూ కేవలం నా అనే పదానికే పరిమితమైపోయారు.
అలాంటివారిలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పేరు కూడ వినిపిస్తోంది. మొదటిసారి 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసిన ఆయన ఓడిపోయారు. ఆ ఎన్నికల తర్వాత ఆయన వైఖరి ఏంటో స్థానిక పార్టీ నేతలకు బాగా అర్థమైంది. అందుకే 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తానని జగన్ అంటే వద్దన్నవారు చాలామందే ఉన్నారు. కానీ బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు టికెట్ ఇవ్వడమే కరెక్ట్ అని జగన్ అనుకుని అతని గెలుపు కోసం పనిచేయమని ఇతర నేతలను ఆదేశించారు. అధినాయకుడు చెబితే ఫాలో అవ్వాల్సిందే కాబట్టి జగన్ మాట మీద మధుసూదన్ యాదవ్ ను మంచి మెజారిటీతో గెలిపించారు అక్కడి కేడర్.
తీరా ఎన్నికలయ్యాక మధుసూదన్ యాదవ్ పాత వైఖరినే రిపీట్ చేశారట. సొంత పార్టీ వాళ్ళను, తన గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులను పూర్తిగా విస్మరించారట. పెద్ద పెద్ద పనుల సంగతి వదిలేస్తే నియోజవర్గంలో జరిగే చిన్నా చితకా పనులను కూడ బయటకు వెళ్లనివ్వకుండా ఆయనే చేసుకుంటున్నారట. దీంతో ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడిన, ఖర్చుపెట్టిన మాకు మిగిలింది ఒట్టి చేతులేనా అంటూ నొచ్చుకుంటున్నారట నేతలు. జగన్ మాట మీద గెలిపించాం కానీ లేకపోతే ఓడగొట్టేవారమని, ఈసారి జగన్ చెప్పినా వినేది లేదని ఆయనకు టికెట్ ఇస్తే ఆ ఒక సీటు పోయినట్టేనని స్వీయ శపథాలు చేసుకుంటున్నారట. ఇక జనమైతే గెలిచిన ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారని, ఎప్పుడూ బెంగుళూరులోనే ఉంటూ సొంత వ్యాపారాలు చూసుకోవడంలోనే ఉన్నారు తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారట.