Vidadala Rajini: విడదల రజనీ పరిస్థితి సంక్లిష్టమే.. అరెస్ట్ తప్పదా?

వైసీపీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజనీపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అవినీతి ఆరోపణలతో ఇప్పటికే కీలక ఆధారాలు బయటపడగా, ఇప్పుడు ఆమె అరెస్టు తథ్యమన్న ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. గవర్నర్ నుంచి అనుమతి రాగానే విచారణ మొదలయ్యే అవకాశం ఉండటంతో, రజనీ రాత్రికి రాత్రే కొత్త సమస్యల్లో చిక్కుకోవచ్చని అంటున్నారు.

గతంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రజనీపై పదవిలో ఉన్న సమయంలో భారీ స్థాయిలో అక్రమ వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి రూ.2.20 కోట్లు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ఆమె మాజీ పీఏతో పాటు, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా కూడా కీలక పాత్ర పోషించినట్లు అధికారికంగా ధృవీకరించారు.

ఈ కేసులో రజనీపై అనుమానాలు గట్టిపడటంతో, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐపీఎస్ అధికారి జాషువాపై కేసు నమోదు చేసేందుకు అనుమతి లభించగా, ఇప్పుడు రజనీని విచారించేందుకు అనుమతులు రావాల్సి ఉంది. గవర్నర్ ఆమోదముద్ర పెట్టగానే రజనీపై కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేసే దిశగా ఏసీబీ అధికారులు ముందుకు సాగుతున్నారు.

అయితే, రజనీకి ప్రస్తుతం ఎటువంటి రక్షణ లభించే అవకాశం కనిపించడంలేదు. అవినీతి ఆరోపణలు కోర్టు విచారణకు వెళ్లినప్పుడు, ఇప్పటికే ఆధారాలు స్పష్టంగా ఉండటంతో, ఆమె తప్పించుకునే మార్గం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది జరిగితే, రాజకీయంగా రజనీ భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.

Public Reaction On CM Chandrababu Sensational Comments On YCP || Ap Public Talk || Ys Jagan || TR