మంత్రి, ఎంఎల్ఏలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు

‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు’ అనేది తెలుగులో చాలా పాపులర్ సామెత.  తెలంగాణాలో కెసియార్ చేయగా లేంది ఏపిలో తాను మాత్రం ఎందుకు ప్రకటించకూడదని అనుకున్నారు. దాంతో మొదటికే మోసం వచ్చేట్లుంది పరిస్ధితి. అభ్యర్ధుల ఎంపికలో చంద్రబాబు ఇంకా సమీక్షల దశలోనే ఉన్నారు. చాలా లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సిగ్మెంట్లపై సమీక్షలు జరుపుతున్నారు. కొందరికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు.

అయితే అదంతా లీకుల రూపంలోనే సుమా . ఇంత వరకరూ ఒక్క అభ్యర్ధిని కూడా అధికారికంగా ప్రకటించలేదు. పైగా గ్రీన్ సిగ్నల్ అందుకున్న వాళ్ళల్లో కూడా ఎక్కువమంది సిట్టింగ్ ఎంఎల్ఏలే. ఎప్పుడైతే సిట్టింగులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని లీకులు బయటకు వచ్చాయో వెంటనే రచ్చ మొదలైంది. వివిధ జిల్లాల్లోని సుమారు 15 నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతల ఆధ్వర్యంలో భారీగానే అసమ్మతి రోడ్డెక్కింది. దాంతో సిట్టింగులకు మళ్ళీ టికెట్లు వద్దంటూ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు ఊపందుకుంటోంది.

అనంతపురం జిల్లాలో  కల్యాణదుర్గం, రాయదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో నిరసనలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో నంద్యాల, ఆళ్ళగడ్డ, కడప జిల్లాలో ప్రొద్దుటూరు, రాజంపేట, కమలాపురం విశాఖపట్నం జిల్లాలో పాయకరావుపేట ఎంఎల్ఏ అనిత, వైజాగ్ దక్షిణం ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్, గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావుల్లో మళ్ళీ వాళ్ళకే టికెట్లివద్దంటూ ర్యాలీలే నిర్వహించారు.

ఇక పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి కె జవహర్ కు నేతలు చుక్కులు చూపిస్తున్నారు. మంత్రికే టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటూ ఆందోళనలే చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కూడా కొందరు సిట్టింగులపై ఇదే విధంగా నిరసనలతో తమ్ముళ్ళు రోడ్డెక్కారు. అధికారికంగా టికెట్లు ప్రకటించక ముందే నిరసనలు ఈ స్ధాయిలో ఉంటే టికెట్లను అఫీషియల్ గా ప్రకటిస్తే తమ్ముళ్ళ రియాక్షన్ ఎలాగుంటుందో ?