లాయర్లు నవ్వారు.! కానీ, బెయిల్ కోసం ట్రై చేయట్లేదు.!

సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూద్రా నవ్వారు.! ‘థంబ్స్ అప్’ చూపించారు కూడా.! ఆయనేమీ ఆషామాషీగా వచ్చేయరు. లక్షల్లో.. కాదు కాదు, కోట్లల్లో సమర్పించుకోవాలి.! మరి, అంత ఖరీదైన లాయర్ ఎందుకు, చంద్రబాబుని బయటకు తీసుకురాలేకపోతున్నారు.?

ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అత్యద్భుతంగా వాదించేసి, సీనియర్ న్యాయవాది లూద్రాకి చెమటలు పట్టించేశారని వైసీపీ అంటోంది. కాదు, చంద్రబాబు తరఫు న్యాయవాది లూద్రానే, సీఐడీ తరఫు న్యాయవాదులకి చుక్కలు చూపించారని టీడీపీ అంటోంది.

లూద్రా అయితే, ‘థంబ్స్ అప్’ చూపించారు. కానీ, చంద్రబాబు బయటకు రాలేదు. అసలెందుకు చంద్రబాబుకి బెయిల్ రావడంలేదు. ఈ ప్రశ్నకు సమాధానం సింపుల్. బెయిల్ కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇంతవరకు ప్రయత్నాలు ప్రారంభించలేదు.

రిమాండ్ వద్దని మాత్రమే చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఒకవేళ రిమాండ్ తప్పనిసరైతే, హౌస్ రిమాండ్ అడుగుతున్నారు. అదీ సంగతి.! చంద్రబాబుకి రాజమండ్రి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఎన్ని రోజులు చంద్రబాబు ఇంకా అక్కడే వుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ తర్వాత రాజకీయ విమర్శలు వేరేలా వుంటాయ్. అందుకే, జైల్లో కొన్ని రోజులు వుండాల్సి వచ్చినా, బెయిల్ కోసం ప్రయత్నించకూడదని చంద్రబాబు భావిస్తున్నారన్నది ఓ వాదన.

నిజానికి, లీగాలిటీస్.. అంటే, అదో పెద్ద చర్చ. ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేసేసుకోవచ్చు. కోర్టు రూమ్‌లో ఏం జరుగుతుంది.? న్యాయమూర్తి ఎలా స్పందిస్తారు.? అన్నది అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు.! ఒక్కటే ప్రశ్న, బెయిల్ కోసం చంద్రబాబు ఎందుకు ప్రయత్నించట్లేదు.? ఆయన వ్యూహాలు ఆయనకి వున్నాయ్.!