ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా. కోర్టులో చంద్రబాబుకు ప్రతికూలంగా తీర్పు వచ్చినప్పుడల్లా ట్విట్టర్లో స్పందిస్తుంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో పెట్టిన ఒక ట్వీట్ పై భారీగా విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో తాజాగా ఆయన నుంచి మరో ఆసక్తికరమైన ట్వీట్ వచ్చింది. ఇందులో భాగంగా… “ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది. ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది” అని ట్వీట్ చేశారు లూథ్రా.
దీంతో… బహుశా చంద్రబాబు కస్టడీ తర్వాత చంద్రబాబుకు చీకటి రోజులు పోయి మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసి ఉండొచ్చని ఈ ట్వీట్ పై కొందరు అనువాదం చేస్తుంటే… బాబుకు ప్రస్తుతం చీకటి దశ అని, తానేమీ చేయలేద్నని లూథ్రా చేతులెత్తేసిన విషయాన్ని ఇలా పరోక్షంగా చెప్పారా అని మరికొంతమంది భావానువాదం చేస్తున్నారు!
కాగా, స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్.. భారీ వాదనల అనంతరం రిమాండ్ తర్వాత కూడా లూథ్రా ట్విట్టర్ లో స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అని ట్వీట్ చేశారు.
అయితే ఇది బాధ్యత కలిగిన వ్యక్తులు, న్యాయవాదులు మాట్లాడాల్సిన మాట కాదని పలువురు నెటిజన్లు లూథ్రాని వాయించి వదిలారు! ఇదే సమయంలో కొన్ని చోట్ల లూథ్రాపై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే!