చంద్రబాబు – లోకేష్ లపై శ్రీమతి ఎన్టీఆర్ ఫైర్… తెరపైకి ప్రవాసి!

చంద్రబాబునాయుడు పేరు చెబితే అంతెత్తున లేచే నందమూరి కుటుంబసభ్యుల్లో లక్ష్మీపార్వతి ఒకరు. బాబుపై ఇంకా పలువురు నందమూరి కుటుంబసభ్యులకు ఆగ్రహం ఉందని కథనాలొస్తున్నా… వారు ఏనాడూ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు! ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబు పైనా, లోకేష్ పైనా నిప్పులు చెరిగారు తెలుగు సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి.

తాజాగా మైకందుకున్న లక్ష్మీపార్వతి… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సమాధి కట్టేయడం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. ఓటమి తర్వాత చంద్రబాబు, ఆయన కుమారుడు ప్రవాసీలుగా మిగిలిపోతారని.. ఇప్పటికే వాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చి రాజకీయాలు చేసి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు! కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును ముంచేసిన ఘనుడు చంద్రబాబు అంటూ లక్ష్మీపార్వతి విరుచుకుపడ్డారు.

అనంతరం టీడీపీ తొలివిడత మేనిఫెస్టోపై స్పందించిన ఆమె… మహిళలు, రైతులను మోసం చేయడమే చంద్రబాబు ఉద్దేశమని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మనవడు లోకేష్ పైనా ఆమె ఫైరయ్యారు. లోకేష్ చదువు సంధ్య లేని మూర్ఖుడని మొదలుపెట్టిన ఆమె… పాదయాత్రలో ముఖ్యమంత్రిపై చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని.. వ్యక్తిగత విమర్శలు చేసే కుసంస్కారి అని విరుచుకుపడ్డారు.

ఇదే సమయంలో చంద్రబాబు హస్తిన టూర్ పై కూడా తెలుగు సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ స్పందించారు. కేసుల మాఫీ కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని.. అనంతరం పొత్తుల రిక్వస్టులు పెట్టుకున్నారని తెలిపారు. అయితే ఈ విషయంలో ఆయన తొలిప్రయత్నం విఫలమయ్యిందని.. పొత్తులపై బీజేపీ పెద్దలు చంద్రబాబును లైట్ తీసుకున్నారని ఆమె వెటకరించారు.

ఇక జనసేన అధినేత పవన్ పై కూడా లక్ష్మీపార్వతి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈసందర్భంగా… చంద్రబాబు సిగ్నల్ ఇచ్చిన తర్వాతే వారాహి రోడ్డెక్కుతోందని ప్రారంభించిన ఆమె… టీడీపీతో కలయిక రాజకీయ నాయకుడుగా పవన్ కళ్యాణ్‌ కు తీవ్ర నష్టం కలిగిందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తమ నాయకుడి విధానాలు అర్ధం కాక జనసేన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారని శ్రీమతి ఎన్టీఆర్ స్పష్టం చేశారు.