లెక్కలడుగుతున్న లక్ష్మీపార్వతి… ఇదో పెద్ద కేసవుతోందా?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సెంట్రల్ జైలు వాసం తాజాగా 42వ రోజుకు చేరిన సంగతి తెలిసిందే. అంటే చంద్రబాబు జైలు జీవితం, బయట ఆయన తరుపున లాయర్ల పోరాటం ప్రారంభమై 41 రోజులు పూర్తయ్యిందన్నమాట. ఈ సమయంలో సుమారు 19 మంది లాయర్లు పదుల సంఖ్యలో పిటిషన్లు, మూడు కోర్టులు.. విజయ్వాడ టు ఢిల్లీ, ఢిలీ టు విజయవాడ (ప్రత్యేక) విమాన ప్రయాణాలు వెరసి ఇప్పటివరకూ ఖర్చు ఎంత అయ్యి ఉంటుంది?

ప్రస్తుతం ఇదే డౌట్ ఎక్స్ ప్రెస్ చేస్తూ… వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ.. ఆ సొమ్మంతా ఎక్కడ నుంచి వచ్చింది, భువనేశ్వరి ఏ షేర్లు, ఎన్ని షేర్లు అమ్మి ఆ డబ్బు తెచ్చారు అని అడుగుతున్నారు లక్ష్మీపార్వతి. దీంతో.. అవినీతి కేసులో అరెస్టై, అందులో వాదించేందుకు ఏర్పాటు చేసుకున్న లాయర్లకు కూడా అదే అవినీతి సొమ్ము పంచుతున్నారా అనే చర్చ తెలుగునాట ప్రారంభమైందని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే… లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏపీ తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ పార్మతి ప్రశ్నించారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారని, సీనియర్‌ లాయర్లకు రోజు రూ. కోటి నుంచి రూ.2.50 కోట్ల ఫీజు ఉందని చెబుతున్న ఆమె… వీరికోసం ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడా అనే సందేహం కలుగుతోందని అన్నారు.

ఇలా లెక్కలేసిన లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ నడుస్తున్న చంద్రబాబు కేసుల మీద వాదించడానికి రోజుకు అన్ని ఖర్చులు కలిసి మూడు కోట్లు అయితే.. లాయర్ల ఫీజుకే రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని అంచనావేసి ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన 2 శాతం హెరిటేజ్‌ షేర్లను విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు లక్ష్మీపార్వతి.

ఇందులో భాగంగా.. 2శాతం షేర్లు అమ్మితే వచ్చేది 400 కోట్ల రూపాయలు అయినప్పుడు… న్యాయవాదలు ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఆమె 5000 కోట్లకు మించి ఎన్ని షేర్లను విక్రయించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై పత్రికా ప్రకటన విడుదల చేసిన లక్ష్మీపార్వతి… ఆ ప్రకటనలో ఈ విషయాలన్నీ పొందుపరిచారు.

ఇందులో భాగంగా… లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలు చెప్పాలని.. వారి ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి డిమాండ్‌ చేశారు. లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు.. ఆ డబ్బును ఎక్కడనుంచి తెస్తున్నారనే విషయంపై పచ్చమీడియా అయినా సమాధానం చెప్పాలని ఆమె అన్నారు.

ఇదే క్రమంలో… దేశ ప్రధానిగా 16 సంవత్సరాలు పనిచేసిన ఇందిరాగాంధీ కూడా తన కేసును వాదించడానికి ఇద్దరే లాయర్లను పెట్టుకున్నారని, ఇంత స్థాయిలో అమెరికా ప్రెసిడెంటు కూడా పెట్టుకోలేదనుకుంటానంటూ లక్ష్మీపార్వతి సెటైర్లు వేశారు. కాగా… చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు మూడు కోర్టుల్లో సుమారు పదుల సంఖ్యలో పిటిషిన్లపై వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి ఫీజులు, అందుకు బాబుకు అయిన ఖర్చు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.