మస్ట్ రీడ్: “లగడపాటి” వచ్చేటి వేళ…!

చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతున్న విజయవాడ ఎంపీ కేశినాని వ్యవహారం ముదిరి పాకానపడుతుందని టీడీపీ బలంగా భావిస్తుందంట. ఈ సమయంలో ప్రత్యామ్నాయ నేతకోసం తెగ ప్రయత్నాలు చేస్తుందంట. ఈ సమయంలో వారికి లగడపాటి రాజగోపాల్ గుర్తుకువచ్చారంట. దీంతో… గతకొన్ని రోజులుగా లగడపాటి కేంద్రంగా విజయవాడ టీడీపీలో తెగ గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి!

అవును… ప్రస్తుతం టీడీపీకి విజయవాడ పార్లమెంట్ సీటుకోసం ఒక ఎంపీస్థాయి అభ్యర్థి కావాలి. కేశినేని నానీ తమ్ముడు ఉన్నాడని బాబు తొలుత భావించినా… ఓట్ల చీలిక ఆందోళనకు గురిచేస్తుందంట. పైగా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వైసీపీ నేతలు బలంగా పాతుకుపోతున్నారు. ఎవరినీ కదిలించలేని పరిస్థితి. దీంతో చంద్రబాబు… లగడపాటితో మంతనాలు జరుపుతున్నారని సమాచారం!

విజయవాడ ఎంపీగా లగడపాటి రాజగోపాల్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 2004, 2009లో విజయవాడ లోక్‌ సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం రాష్ట్ర విభజన సమయంలో కాస్త హడావిడి చేసిన ఆయన… కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ముందే ఊహించారో ఏమో కానీ… రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తానని శపథం చేశారు.

ఇక పొలిటీషియన్ గా ఫుల్ బీజీగా ఉన్న లగడపాటికి అప్పట్లో మరో పార్ట్ టైం జాబ్ కూడా ఉండేది. అదే సర్వేలు చేయడం.. ఫలితాలు ప్రకటించడం. ఫలితంగా ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్‌ అనే పేరొచ్చింది. ఒకటి రెండు సార్లు ఇవి సక్సెస్ అయినా… 2018 తెలంగాణ ఎన్నికలు, 2019లో ఏపీ ఎన్నికల ఫలితాలపైనా ఆయన సర్వే జోస్యం ఫలించలేదు! దీంతో ఆయన ఆ పార్ట్ టైం జాబ్ ని కూడా పక్కనపెట్టారు!

అయితే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు భేటీ అయినప్పటికీ… ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ఆయనకే మళ్లీ బెమ కలిగిందా.. లేక, చంద్రబాబే బలవంతపెడుతున్నారా అనేది తెలియదు కానీ.. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారని మాత్రం విజయవాడ కేంద్రంగా కథనాలొస్తున్నాయి. దీనికి తోడు ఆయన కుమారుడిని కూడా రంగప్రవేశం చేయించబోతున్నారని అంటున్నారు.

అవసరమైతే ఇద్దరూ పోటీ చేస్తారని కూడా విజయవాడలో ఒక వర్గం బలంగా వాదిస్తుంది. అందులో భాగంగా విజయవాడ ఎంపీ సీటుకు లగడపాటి రాజగోపాల్ పోటీచేస్తారని, ఇక అత్యంత కీలకమైన గన్నవరం నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడిని రంగంలోకి దింపుతారని అంటున్నారు. మరి విజయవాడ కేంద్రంగా వస్తున్న ఈ రాజకీయ కథనాలు ఏ మేరకు వాస్తవ రూపం దాల్చబోతున్నాయనేది వేచి చూడాలి!