‘ఎన్ని నాటకాలాడుతున్నావయ్యా చంద్రబాబూ…’

గత నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకోసం రకారకాల నాటకాలాడారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఆరోపించారు. ఈ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం లో  బుక్ చేసిన కేసులను ఎత్తి వేసినందుకు ఒక వైపు అభినందిస్తూనే, ఇది కూడా నాటకమే నని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దన్నా, తర్వాత హోదా  కావాల్నా కూడా, ఆయన ఎన్డీయేలో  ఉన్నా, ఎన్డీయే నుంచి బయటకొచ్చినా… అందులో రాష్ట్ర ప్రయోజనాలకంటే, స్వార్థ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని కెవిపి ఆరోపించారు. ఆయన చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను ఇక్కడ పూర్తి గా అందిస్తున్నాం.

==

గౌరవ  ముఖ్యమంత్రి చంద్రబాబు గార్కి…

ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి ప్రత్యేకహోదా తోనే ముడిపడివుందని, భారత పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కల్పించవలసిన నైతిక బాధ్యత కేంద్రానిది అని, అదేవిధంగా కేంద్రాన్ని ప్రత్యేకహోదా డిమాండ్ చేసి తీసుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే నని గత నాలుగున్నర ఏళ్లుగా రోడ్డెక్కి డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ తో సహా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్ధుల పై మీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించుకొన్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా రాష్ట్ర ప్రజల అందరి తరుపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.

విభజన హామీల విషయంలో ఇక బీజేపితో అంటకాగితే వచ్చే ఎన్నికలలో మీ పుట్టి మునుగుతుందని గ్రహించి.. బీజేపి పై కన్నెర్ర చేయాలని నిర్ణయించుకొని.. ప్రత్యేకహోదా కావాలని మెల్లమెల్లగా, భయం భయంగా మీరు స్వరం విప్పుతున్నప్పుడే.. అంటే గత సెప్టెంబర్ 23న నేను లేఖ రాస్తూ.. ప్రత్యేక హోదా ఉద్యమకారులపై మీరు బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయవలసినదిగా డిమాండ్ చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను.

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొదటి రోజు నుంచి బీజేపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ కు న్యాయంచేయవలసిన అన్ని విషయాలలో రకరకాల సాకులు వెదుకుతూ కాలం వెళ్ళబుచ్చడం.. దానికి మీ నేతృత్వం లోని రాష్ట్రప్రభుత్వం డూడూ బసవన్నలా తలూపడం చూసి ఆంధ్రప్రదేశ్ కు న్యాయంచేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేప్పట్టి, ఉద్యమాలు చేసి..మీకు కర్తవ్యాన్ని గుర్తు చేసినా..అధికార మత్తులో, మోడి మోజులో ఉన్న మీకు తలకెక్కలేదు. ఇక మీ నుంచి ఎటువంటి వత్తిడి లేనందున మోడీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు.

అయితే విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి అప్పటి యుపిఎ కాబినెట్ తీసుకొన్న ప్రత్యేకహోదా నిర్ణయాన్ని అమలుపరచమని యూపీఏ చైర్మన్ శ్రీమతి సోనియా గాంధీ గారు 02.06.2014 న ఒకటి 19.02.2015 న ఒకటి, రెండు లెటర్స్ వ్రాసారు. ఇక జూన్ 2015 లోనే 9 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్ర కు ప్రత్యేకహోదా ఇవ్వమని తీర్మానం చేసి కేంద్రానికి ఇచ్చారు. 19.10.2015 న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారికి ఆంధ్ర కు ప్రత్యేకహోదా ఇవ్వమని లెటర్ వ్రాసి కర్తవ్యాన్ని గుర్తు చేసారు.

3

మార్చ్ 2016 లో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాలు సేకరించి తెస్తే.. దాని కోసం ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి..దానిమీద శ్రీమతి సోనియాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు సైతం తమ సంతకాలు చేసి కేంద్రానికి పంపిన సంగతి మీకు గుర్తువుండే వుంటుంది. రాజధాని విషయంలో ఢిల్లీ నుంచి పిడికెడు మట్టి, చెంబెడు నీళ్ళు ఇచ్చి చేతులు దులుపుకొన్న మోడీ గారికి.. రాష్ట్రంలో మూలమూలల నుంచి మట్టి, నీళ్ళు సేకరించి పంపి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున నిరసనను తెలియచేసింది. మార్చ్ 2018 లో జరిగిన ఏఐసిసి ప్లీనరీ లో సైతం ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఖండిస్తూ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం తో పాటు, యుపిఏ అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా ఇస్తామని ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. అదేవిధంగా, జూలై 2018 లో జరిగిన విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించింది.

ఆంధ్ర కు ప్రత్యేకహోదా కోరుతూ నేను రాజ్యసభలో ప్రైవేట్ మెంబెర్ బిల్ ప్రవేశపెట్టి, దానిపై వోటింగ్ జరిగే పరిస్థితి వచ్చినప్పుడు దానిపై దాదాపు 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు, పార్లమెంట్ చరిత్ర లో ఎన్నడులేని విధంగా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ కు మద్దతుగా రెండు సార్లు విప్ జారి చేసి..ఈ బిల్లుకు మద్దతు ఇవ్వవలసినదిగా తమ సభ్యులకు నిర్దేశించి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్దిని నిరూపించుకొంది. కనీసం అప్పుడు కూడా మీరు కళ్ళు తెరిచి వాస్తవం గ్రహించక పోగా, కేంద్రం ఇచ్చిన ప్యాకేజి అద్భుతమని రాజ్యసభలో మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సభాముఖంగా ప్రకటిస్తే.. దానికి మిగతా మీ పార్టీ సభ్యులు బల్లలు చరిచి మరీ ఆనందిస్తే.. మీ ఆదేశాలకు అనుగుణంగా నడుస్తున్న వారిని చూసి మీరు ఆనందంతో పులకించిపోయారు..

4

మీరు మోడీ గారి మాయలో ఉన్నంత కాలం, ప్రత్యేకహోదా సంజీవని కాదని, ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు బాగుపడలేదని, ప్రత్యేకహోదా అంటే జైలుకు పంపిస్తానని రకరకాలుగా ప్రకటనలు చేసి జనాన్ని భయపెట్టి పబ్బం గడుపుకొన్నారు. ఇక ప్రత్యేకహోదా కు ప్రత్యామ్నాయం అంటూ.. కేంద్రం ఒక పనికిరాని, కంటితుడుపు ప్యాకేజిని ప్రకటిస్తే.. “ప్యాకేజి” పేరువినగానే అనిర్వచనీయమైన ఆనందానికి గురి అయ్యి, ఒడలు మరచి అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ మీరు ఆనంద భాష్పాలు కార్చారు. ఇక ఆ మైమరుపులో అసెంబ్లీ లో ధన్యవాద తీర్మానాలు చేసి పంపారు. కేంద్ర ఆర్థికమంత్రి గారికి శాలువాలు కప్పి, సన్మానాలు చేసి తిరుపతి ప్రసాదం అందచేయడమే కాకుండా..ఇంకా వారు చేసిన “ప్యాకేజి” మేలుకు అదీ చాలదని.. వారికి 02.05.2017న మీరు ఒక ప్రత్యేక ప్రశంసల లేఖ రాసి పంపించారు. వారు ఈ లేఖను ఫ్రేమ్ కట్టి మరీ కేంద్ర ఆర్ధిక శాఖ దస్త్రాలలో భద్రంగా దాచుకున్నారు.

ఇక ముఖ్యంగా 04.06.2017 న గుంటూరు లో రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తుచేయాలని- ప్రత్యేకహోదా కు మద్దతు ఇచ్చే జాతీయ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తే.. మీరు ఆ మీటింగ్ ను భగ్నం చేయడానికి ఎన్ని ఇబ్బందులు కలుగ చేశారో, మీ పార్టీ వారితో నల్లజెండాలు పట్టించి ఎలా ధర్నాలు చేయించారో గుర్తు తెచ్చుకోండి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఆదేశాలు జారీ చేసి మరీ, రాహుల్ గాంధీ గారితో సహా, ఇతర జాతీయ పార్టీ నాయకుల ఫ్లెక్సీ లను చింపడం, ఎయిర్ పోర్ట్ నుంచి సభా స్థలి వరకు దారి పొడుగునా నల్ల జెండాలు చూపుతూ, వారి కార్ల పై టమాటాలు, కోడిగుడ్లు విసరడం, అక్కడక్కడ రాళ్ళు విసరడం తో పాటూ.. “ఆంధ్ర ద్రోహులారా..గో బాక్” నినాదాలు చేయించిన విషయం మరిచిపోయారా? ..ఆ మీటింగ్ ను భగ్నం చేయడానికి చేసిన ప్రయత్నాలు మరిచిపోయారా?

నల్లజెండాలు చూపి, కోడిగుడ్లు, టమాటాలు విసిరి జాతీయ పార్టీల నాయకులను ఆరోజు అవమానించి ఈరోజు మీరు సాధించింది ఏమిటి? కాని, ఈరోజు ఎన్నికలు అనగానే..ప్రజలను మాయచేయాలని..మీరు, మీ వందిమాగధ బృందాలు మొన్న నల్ల చొక్కాలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తుంటే.. శాసన సభలో, బయటా మీ నల్ల చొక్కాల రెపరెపలు చూసి.. మోడీ గారు విదేశాలనుంచి తెచ్చే నల్లధనపు రంగు ఇదేనోమో అని ప్రజలు గుసగుసలాడుకొంటున్నారు.

5

మొన్న మొన్నటి దాకా.. మోడీ గారిని ఎవరైనా ఏమైనా అంటే గుండెల్లో గునపం గుచ్చుకొన్నట్లు విలవిలలాడి, మోడీ గారి పై ఈగలు ఏమైనా వాలితే ఆయన ఇబ్బంది పడతారని ఆయన చుట్టూ విసన కర్రలు పట్టుకొని తిరిగిన మీరు..ఎన్నికల పుణ్యాన ప్రజలను నమ్మించాలనే ప్రయత్నంలో.. ఆయనపై కళ్ళు ఎర్రచేసి.. ఇప్పుడు మోడీ గారి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహిస్తానంటూ.. కాళ్ళకు బలపాలు కట్టుకొని దేశమంతా తిరగడం చూసి.. జాతీయ పార్టీల నాయకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏమైనా…కనీసం ఎన్నికల పుణ్యాన అయినా.. ఇప్పటికి మీకు మళ్ళీ ప్రజలు గుర్తుకు వచ్చినందుకు ఆనందం! .

ఇక ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వ శకం ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. ఆ తరువాత వచ్చేది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యుపిఏ ప్రభుత్వమేనని ప్రజల నాడిని బట్టి తెలుస్తున్నది. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పై, రాహుల్ గాంధి గారి పై పూర్తి విశ్వాసం ఉంది. ఆయన పదవి లోకి రాగానే మొదటగా సంతకం చేసేది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కు సంబంధించిన దస్త్రం పైనే. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. కాని మోడీ ప్రభుత్వానికి మిగిలిన ఈ కొద్దిరోజులలో, ఏమి చేయదని తెలిసీ మీరు ధర్నాలు, దీక్షలు అంటూ డ్రామాలు నడపడం.. మోడీ దిగేది.. రాహుల్ గెలిచేది ఏదో మీ ప్రయత్నంవల్లే నని ప్రజలు అనుకోవాలనే..దుగ్ధతో తప్ప..ఆంధ్ర ప్రజలకు మేలుచేయాలనే ఉద్దేశ్యంతో కాదని స్పష్టం గా తెలుస్తున్నదని..

లేకపోతే..ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని మీరు ఇప్పుడు చూపెడుతున్న కోపాలు, పడుతున్న తాపాలు, చేస్తున్న పరుష ప్రసంగాలు, పెడుతున్న పెడబొబ్బలు, కారుస్తున్న కన్నీళ్ళు అన్నీ.. ఎన్నికల ముంగిట ప్రజలను మెప్పించి మాయచేయడానికి చేస్తున్న అభినయావేశాలేనని… వెన్నుపోటుతో..యన్.టి. ఆర్ గారి రాజకీయ వారస్వతాన్ని లాక్కొన్న మీరు.. కనీసం ఏదో ఆయనకు నట వారసులమని చెప్పుకొని తృప్తిపడుతున్న ఆయన నిజ వారసులను తలదన్ని..ఇప్పుడు ఆయన నటనా వైదుష్యానికి కూడా వారసులు మీరే అని నిరూపించుకొనే ప్రయత్నంలో ఉన్నారని జనం విశ్వసించే ప్రమాదం ఉంది.. తస్మాత్ జాగ్రత్త.

భవదీయుడు

(డా.కె.వి.పి.రామచంద్ర రావు)
ఫిబ్రవరి 8, 2019

 

( గమనిక :  లేఖను క్లుప్తం చేశాం)