ఆంధ్రా రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రాయలసీమలో జగన్ కు బలమెక్కువ అన్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తున్నారు సీమ నేతలు. అంతేకాదు రెడ్లలో జగన్ కు బలమెక్కువ అన్న వాదనకు తెర దింపుతున్నారు సీమ రెడ్డి నేతలు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి, దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన టిడిపిలో చేరనున్నట్లు ఇప్పటికే కసరత్తు చేసినట్లు చెబుతున్నారు.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీకి ఇవాళ రాత్రి చంద్రబాబు తన నివాసంలో డిన్నర్ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విందులోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎప్పుడు టిడిపిలో చేరతారన్నది తేలనుంది.
ఇదిలా ఉంటే నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కోట్ల గైర్హాజరయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని ఆంధ్రా పిసిసి నేత రఘువీరారెడ్డి కోరారు. కానీ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం వాయిదా వేసుకోవాలని కోట్ల కోరారు.
అయితే కోట్ల కోరికను రఘువీరా మన్నించలేదని చెబుతున్నారు. ఆఫీసు ప్రారంభోత్సవం వాయిదా వేసేదిలేదని చెప్పారని అంటున్నారు. ఈ విషయంలో కోట్ల గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా కోట్ల గత కొంతకాలంగా కాంగ్రెస్ రాజకీయాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
టిడిపి, కాంగ్రెస్ పొత్తు ఉంటే కాంగ్రెస్ తరుపున కర్నూలు పార్లమెంటు సీటుకు పోటీ చేయాలన్న ఆలోచనలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. కానీ టిడిపి, కాంగ్రెస్ మధ్య పొత్తు తెలంగాణలో ఘోరంగా వికటించడంతో ఆంధ్రాలో ఎవరికి వారే పోటీ చేయాలని టిడిపి, కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నాయి.
జాతీయ స్థాయిలో ఫ్రంట్ లో కలిసి పనిచేయాలని, ఎపిలో మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్లు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో అయితే కర్నూలు ఎంపిగా గెలవలేనన్న ఆందోళనతోనే కోట్ల టిడిపి సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
విందు భేటీ తర్వాత కోట్ల చేరికపై మరింత క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. మరోవైపు టిడిపి కీలక నేతలు కొందరు కోట్ల కుటుంబంతో టచ్ లో ఉన్నారు. వారి ఆహ్వానం మేరకే కోట్ల ఫ్యామిలీ విందు భేటీలో పాల్గొనబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.