చంద్రబాబుకు షాక్ తప్పదా ? మండుతున్న జిల్లా నేతలు

వచ్చే ఎన్నికల్లో సొంత జిల్లాలో చిత్తూరులోనే చంద్రబాబానాయుడుకు షాక్ తప్పదా ?  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలతో అవుననే అంటోంది క్షత్రియ సామాజికవర్గం. ఇంతకీ విషయం ఏమిటంటే, జిల్లాలోని నగిరి, పుంగనూరు, గంగాధర నెల్లూరు, సత్యవేడు, తిరుపతిలో క్షత్రియ సామాజికవర్గం ఓట్లు బాగానే ఉన్నాయి. పై నియోజకవర్గాల్లో కూడా నగిరి, సత్యవేడులో చాలా ఎక్కువ. నియోజకవర్గాల పునర్విభజనలో పుత్తూరు రద్దవటంతో రాజకీయంగా రాజుల సామాజికవర్గానికి పై ఐదు నియోజకవర్గాలు కీలకంగా మారాయి.

 

ఒక అభ్యర్ధి గెలుపోటముల్లో పై సామాజికవర్గం ఓట్లు గణనీయంగానే ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. అటువంటి సామాజికవర్గాన్ని చంద్రబాబు చేతులారా దూరం చేసుకుంటున్నట్లే కనబడుతోంది. మొన్నటి వరకూ పుంగనూరు నియోజకవర్గంలో ఇన్చార్జిగా వెంకటరమణరాజు ఉండేవారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్ది అనుకున్నారు. అయితే, అనూహ్యంగా రాజును తప్పించి అనూషారెడ్డిని చంద్రబాబు అభ్యర్ధిగా ప్రకటించేశారు.

 

క్షత్రియులకు ఇస్తారనుకున్న సీటు జారీపోయేసరికి ఆ సామాజికవర్గంలో అసంతృప్తి మొదలైంది. సరే ఎటూ నగిరి నియోజకవర్గంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అక్కడైనా ఇస్తారని అనుకున్నారు. అయితే నగిరిలో గాలి ముద్దకృష్ణమనాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ ను ప్రకటించేశారు. దాంతో నగిరిలో పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకున్న అశోక్ రాజుకు తీవ్ర నిరాశ ఎదురైంది. రెండు  సీట్లూ చేజారిపోవటంతో జిల్లాలో క్షత్రియులు పోటీ చేయటానికి ఒక్క నియోజకవర్గం కూడా లేదు.  

 

గతంలో ఇదే నియోజకవర్గం నుండి డివి గోపాలరాజు, ఇవి గోపాలరాజు, దొరైస్వామిరాజులు ఎంఎల్ఏలుగా గెలిచారు. అంటే క్షత్రియుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కారణంగానే మూడుసార్లు ఎంఎల్ఏలుగా గెలిచారనేది అర్ధమవుతోంది. అటువంటిది  వచ్చే ఎన్నికల్లో క్షత్రియులకు ప్రాతినిధ్యమే లేకపోవటంతో మొత్తం రాయలసీమలోన ఇంకెక్కడా పోటీ చేయటానికి అవకాశం లేకుండా పోయింది.

 

ఇదే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడి తేల్చుకుందామని సామాజికవర్గంలోని కీలక నేతలు అమరావతికి చేరుకుంటున్నారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి రాగానే భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ చంద్రబాబు గనుక సానుకూలంగా స్పందిచకపోతే పరిస్ధితి ఎలాగుంటుందనే విషయంలో ఆసక్తి నెలకొంది.