టిపిసిసి ఉత్తమ్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ గుస్సా?

కోమటిరెడ్డి బ్రదర్స్… తెలంగాణ ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కాంగ్రెస్ లో డేర్ అండ్ డాషింగ్` లీడర్లుగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ పగ్గాలు అప్పజెప్పండి అధికారంలోకి తీసుకొస్తామని అధిష్టానానికి చెప్పిన నేతలు వారు. నల్లగొండ జిల్లా రాజకీయాలలో తిరుగులేని నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.అంతలా పేరు తెచ్చుకున్న కోమటి రెడ్డి బ్రదర్స్ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పై గుస్సగా ఉన్నారని తెలుస్తోంది. ఇంతకీ కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్రుగా ఉండటానికి కారణమేమిటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లాలో తిరుగులేని రాజకీయ నాయకులు కోమటి రెడ్డి బ్రదర్స్. 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయాక బ్రదర్స్ ఇద్దరూ బిజెపిలోకి వెళ్లనున్నారని ఆ తర్వాత టిఆర్ ఎస్ లోకి వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అవన్నింటిని పటా పంచలు చేస్తూ తాము ఎక్కడికి వెళ్లేది లేదని అన్నదమ్ములిద్దరూ గట్టిగా చెప్పారు. పార్టీ పగ్గాలు ఇవ్వండి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో బ్రదర్స్ ఇద్దరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగానే పోరాడారు. టిఆర్ ఎస్ బలంగా ఉన్నా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిచి టిఆర్ ఎస్ కు సవాల్ విసిరారు.

 అప్పటి నుంచే టిఆర్ ఎస్ కి, కోమటి రెడ్డి బ్రదర్స్ కు పోరు ఎక్కువైంది. ఎవ్వరికి కూడా అదరకుండా బెదరకుండా దూకుడు ప్రదర్శించారు. నల్లగొండలో కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడి హత్య జరిగినా కుంగి పోలేదు. మంత్రి జగదీష్ రెడ్డితో ఇబ్బందులు వచ్చినా వారు ధీటుగానే ఎదుర్కోన్నారు.  దీంతో కాంగ్రెస్ లో వారు మంచి మార్కులే సాధించారు. అసెంబ్లీలో మండలి చైర్మన్ పై మైకు విసిరిన ఘటనలో సస్పెండ్ అయినా వారు ప్రభుత్వంపై గట్టిగానే పోరాడారు. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ లో తమకు ప్రాధాన్యత లభించడం లేదని బ్రదర్స్ అలకగా ఉన్నారని తెలుస్తొంది.

రాహుల్ గాంధీ పర్యటనలో తమకు తగిన ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తితో బ్రదర్స్ ఉన్నారని తెలుస్తోంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో కూడా బ్రదర్స్ పాల్గొనలేదు. అలాగే తమ నియోజక వర్గాల నుంచి కానీ, జిల్లా నుంచి కానీ బహిరంగ సభకు జనసమీకరణ చేయలేదు. బహిరంగ సభ తర్వాత బ్రదర్స్ పెద్దగా కనిపించడం లేదు. తమకు తగిన విలువ ఇవ్వనప్పుడు తామెందుకు దూకుడుగా వ్యవహరించాలనే ఆలోచనలో బ్రదర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ టిపిసిసి పై గుర్రుగా ఉన్నారని పలువురు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. గతంలో కూడా టిపిసిసి ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉండనని, పార్టీ పగ్గాలు ఇవ్వాల్సిందేనన్నారు. ఆ తర్వాత పరిస్థితులతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెనక్కు తగ్గినా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం అసలు రాజీ పడటం లేదని తెలుస్తోంది. పార్టీలో పటిష్టమైన బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. 

ఎప్పుడు చర్చల్లో ఉండే కోమటి రెడ్డి బ్రదర్స్ మరోసారి చర్చల్లో కెక్కారు. ఇప్పుడు వారిని అధిష్టానం బుజ్జగిస్తుందా లేక కోమటిరెడ్డి బ్రదర్స్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ అందరిలో మొదలైంది. తెలంగాణ రాజకీయాలలో కోమటిరెడ్డి బ్రదర్స్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.