మహాకూటమిలో సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు ఎటూ తేల్చకపోవడంపై టీజేఎస్ అధినేత కోదండరామ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మహాకూటమి సమావేశాలు చాయి తాగి పోయేందుకే పరిమితమవుతున్నాయన్నారు. సీట్ల పంపకాలపై తొందరగా తేల్చి ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు.
లేటు చేసిన కొద్ది పరిస్థితులు బలహీన పడి ప్రత్యర్ధికి బలం చేకూరుతుందని కోదండరాం అన్నారు. ఉమ్మడి అజెండాను ప్రకటిస్తే దాన్ని ప్రజల్లో చర్చకు పెట్టె అవకాశం లభిస్తుందని కోదండరాం అన్నారు. మహాకూటమి కొనసాగాలన్నదే తమ అభిమతం అన్నారు. జనసమితికి, మహాకూటమికి గౌరవ ప్రదమైన చర్చలు జరుగుతున్నాయన్నారు.
సీట్ల పంపకాలపై తాము ఏనాడు బహిరంగ ప్రకటనలు చేయలేదన్నారు. జనసమితికి ఎన్ని సీట్లు ఇవ్వాలో వాళ్లకు తెలుసన్నారు. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందన్నారు. దానిని బట్టి తమ నిర్ణయం ఉంటుదని కోదండరాం అన్నారు. కోదండరాం పోటి చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ కు జనసమితి అల్టీమేటం ఇచ్చిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతాయన్నారు.
కోదండరాం పోటిని పార్టీ నిర్ణయిస్తుందని కోదండరాం చేసిన వ్యాఖ్యలతో అందరిలో చర్చ మొదలైంది. కోదండరాం ముందుగా జనగామ నియోజకవర్గం నుంచి ఆ తర్వాత ఉప్పల్ నుంచి పోటి చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనికి స్పష్టతనిస్తూ తానేమి పోటి చేయనని కోదండరాం తెలిపారు. తాజాగా పార్టీ నిర్ణయిస్తుందని అనడంతో కోదండరాం పోటి చేస్తారా అనే చర్చ మొదలైంది.
కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితిలో ప్రముఖ న్యాయవాది ప్రహ్లాద్ చేరారు. గతంలో జేఏసీలో పనిచేసిన ప్రహ్లాద్ కోదండరాంతో విభేదించి వెళ్లిపోయారు. తనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవినిస్తామని ఆశచూపి టిఆర్ ఎస్ కోదండరాంని విమర్శించాలని చెప్పిందన్నారు.
ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని కోదండరాం అన్నారు. కేసీఆర్ కాస్త నోరు దగ్గర పెట్టుకోని మాట్లాడాలన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే బాగుండదన్నారు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటే కేసీఆర్ కు భయమెందుకన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది పరిచానని చెప్పుకుంటున్న కేసీఆర్ కు ఇక పొత్తులపై భయమేందుకని ప్రశ్నించారు. మహాకూటమిని చూస్తే కేసీఆర్ కు భయం అవుతుందని కోదండరాం ఎద్దేవా చేశారు.